భూపాలపల్లి, మహా :
భూపాలపల్లి నియోజకవర్గంలో
సోమవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వస్తున్నారని, ఈ పర్యటనను విజయవంతం చేయాలని నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. ఆదివారం భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే జీఎస్సార్ లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఉదయం 11 గంటలకు కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించిన అనంతరం స్థానిక హైస్కూల్ గ్రౌండ్లో జరిగే పబ్లిక్ మీటింగ్లో మంత్రులు పాల్గొంటారని ఎమ్మెల్యే తెలిపారు. గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో జెన్కో సీఎస్ఆర్ నిధులు రూ.5.5 కోట్లతో నూతనంగా నిర్మించనున్న బస్ స్టేషన్ నిర్మాణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. చెల్పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రులు పాల్గొని, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేయనున్నారు. భూపాలపల్లి భాస్కరగడ్డలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సందర్శించి, ఎస్పీ కార్యాలయంలో టాస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా సింగరేణి సీఎస్ఆర్ నిధులు రూ.100 లక్షల వ్యయంతో కొత్తగా నిర్మించిన జిల్లా గ్రంధాలయాన్ని మంత్రులు, ఎంపీ ల చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఉంటుందని ఎమ్మెల్యే మీడియాకు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మీడియా ఇన్ఛార్జి పిప్పాల రాజేందర్, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు దేవన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








