భూపాలపల్లి, మహా :
చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో గురువారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ చేనేత కార్మిక సంఘాల నాయకులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
చేనేత పరిశ్రమకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ఇది గ్రామీణ ప్రాంతాలలో ఉపాధికి మూలస్తంభంగా నిలుస్తోందన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు.
వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చేనేత కార్మికులకు రుణమాఫీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
స్వాతంత్ర్య సముపార్జనలో చేనేత రంగం ఒక సాధనంగా నిలిచిందని అన్నారు.
భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో విదేశీ వస్త్రాలను బహిష్కరించాలన్న లక్ష్యంతో స్వదేశీ ఉద్యమం వచ్చినట్లు పేర్కొన్నారు. 1905వ సంవత్సరం ఆగస్టు 7న స్వదేశీ వస్తువుల బహిష్కరణపై జరిగిన సమావేశంలో విదేశీ వస్త్రాలు బహిష్కరించడంతో పాటు దేశీయ ఉత్పత్తుల వినియోగానికి పిలుపునిచ్చారని, అలా విదేశీ వస్తు బహిష్కరణల కీలకరోజైన ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు. జిల్లాలో మగ్గాలపై బట్టలు నేసే కార్మికులు చాలామంది ఉన్నారని, మహదేవ్ పూర్ మండలంలో దసలి పట్టుతో నేసే బట్టలు విదేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు వర్కు షెడ్ ఏర్పాటు చేయాలని చేసిన విజ్ఞాపనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.
చేనేత రంగంలో విశిష్ట కృషి చేసిన చేనేత కార్మికులను జిల్లా కలెక్టర్ శాలువాతో ఘనంగా సత్కరించారు. చేనేత దినోత్సవంపై నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, పద్మశాలి సంగం అధ్యక్షులు
భీమనాధుని సత్యనారాయణ,
చేనేత సహకార సంఘం సొసైటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.







