ఆదిలాబాద్ మహా : బీఆర్ఎస్ పార్టీ, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి సహనం కోల్పోయారు.కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జన్కపూర్ లో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు.. చేతికి ఏది దొరికితే వాటిని విసిరేశారు. టేబుల్ పై ఉన్న వాటర్ బాటిళ్లను కాంగ్రెస్ నేత శ్యామ్ నాయక్ పై విసిరేసారు. ఆమె ప్రవర్తనతో అక్కడ ఉన్న అందరూ షాక్ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే ..కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జన్కపూర్ లో గురువారం జరిగిన రేషన్ కార్డు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోవా లక్ష్మి హాజరయ్యారు.కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ప్రసంగంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల గురించి ప్రస్తావించగా అక్కడే ఉన్న కాంగ్రెస్ అసెంబ్లీ ఇంచార్జి శ్యాం నాయక్ అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇది ప్రస్తుత ప్రభుత్వ అధికారిక కార్యక్రమమని గత ప్రభుత్వ పాలన గురించి మాట్లాడవద్దని అనడంతో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి.వాగ్వివాదం తారాస్థాయికి చేరడంతో కోవలక్ష్మి కోపంతో ఊగిపోతూ శ్యాం నాయక్ పై వాటర్ బాటిల్‌ను విసిరేసింది.ప్రోటోకాల్ లేని వ్యక్తి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని శ్యామ్ పై నోరు పారేసుకుంది. ఎమ్మెల్యే తీరు పట్ల కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రజా ప్రతినిధికి ఇంత అసహనమైతే ఎలా అంటూ చర్చించుకుంటున్నారు. ఘటన పట్ల కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు.మొత్తం మీద ఈ ఘటన మాత్రం స్థానికంగా సంచలనం సృష్టించింది. కార్యక్రమం అనంతరం బయట ఆమె శ్యామ్ నాయక్ పై వాడు వీడు అంటూ మాటల దాడి చేసారు. దొంగ నాకొడుకు వలస నా కొడుకు అంటూ ఘాటైన తిట్ల దండకం అందుకున్నారు.నాన్ లోకల్ వాడైన శ్యామ్ తన నియోజక వర్గంలో కొచ్చి తననే ప్రశ్నిస్తాడా అంటూ మండి పడ్డారు. అతను జీవితంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కాలేడని వ్యాఖ్యానించారు. మరోమారు తన జోలికొస్తే ఉరికిచ్చి కొడతామని హెచ్చరించారు.







