మంచిర్యాల, మహా : నిరక్షరాస్యులు లేని అక్షరాస్యత జిల్లాగా మంచిర్యాలకు పేరు తేవాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య అన్నారు. నవభారత సాక్షరత కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, జిల్లా విద్యాధికారి ఎస్. యాదయ్య, విద్యాశాఖ అదనపు సంచాలకులు శ్రీనివాస చారి లతో కలిసి ప్రారంభించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమం ప్రత్యేకంగా 3 అంశాలతో ఉంటుందని, మొదటిది 15 సంవత్సరాలు దాటిన నిరక్షరాస్యులకు విద్యను అందించడం, రెండవది 10వ తరగతి, ఇంటర్ అనుత్తీర్ణులైన వారిని ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయడం, మూడవది సమాజంలో ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి చేయూత అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ అక్షరాస్యతా కార్యక్రమాలలో పాల్గొని సమాజంలో ఉన్న నిరక్షరాస్యతను నిర్మూలించవలసిన అవసరం మనందరిపై ఉందని పేర్కొన్నారు. ప్రతి మండలం నుండి ఇద్దరు రిసోర్స్ పర్సన్లు మండల కేంద్రంలో జరిగే శిక్షణలో పాల్గొని గ్రామస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. 1971 నుండి వయోజన విద్యా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఇందులో భాగంగా జిల్లాలోని 31 వేల 435 మంది నిరక్షరాస్యులను గుర్తించి వాలంటీర్ల ద్వారా చదువు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రు నాయక్, కమ్యూనిటీ మొబైల్ అధికారి చౌదరి, క్వాలిటీ కోఆర్డినేటర్స్ సత్యనారాయణ మూర్తి, శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.







