ఖమ్మం, మహా.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తయితే, తెలంగాణకు కృష్ణా జలాలపై పెద్ద ముప్పు వాటిల్లుతుందని భట్టి విక్రమార్క స్పష్టంగా హెచ్చరించారు.
శ్రీశైలం రిజర్వాయర్ నుండి రోజుకు 11 టీఎంసీలు పోతిరెడ్డిపాడు ద్వారా తరలిస్తే, కేవలం 25 రోజుల్లోనే రిజర్వాయర్ ఖాళీ అవుతుందని, దీనివల్ల నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల రైతాంగానికి తాగునీరు, సాగునీటి లోటు తీవ్రతరం అవుతుందని తెలిపారు.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని వంగవీడులో ఆదివారం కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక అభివృద్ధి అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. రూ. 630.30 కోట్లతో 33 వేల ఎకరాలకు సాగునీరు అందించే జవహర్ ఎత్తిపోతల పథకంకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ శ్రీశైలం ఎగువ భాగంలో రోజుకు 11 టీఎంసీల నీటిని తరలించే పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలా నీటిని తరలించడం వల్ల నల్లగొండ, ఖమ్మం జిల్లాల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని, కేవలం 25 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బనకచర్ల అడ్డుకట్టను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రంతో, న్యాయస్థానాలతో పోరాడి బనకచర్లను అడ్డుకున్నారని, అందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. గోదావరి ఎగువ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత, నీటి వాటాలు తేలిన తర్వాతే బనకచర్ల గురించి చర్చించాలని అన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడుతూ, గిరిజనులపై ప్రేమ ఉంటే ఆంధ్రప్రదేశ్ సీఎం పోలవరం ఎత్తు తగ్గించి, ముంపు నుంచి రెండు లక్షల ఎకరాలను కాపాడాలని డిమాండ్ చేశారు. భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం నుంచి మినహాయించిందని, అయితే తరువాత బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ఆర్డినెన్స్ తీసుకొచ్చి గిరిజనుల భూములను పోలవరానికి ధారాదత్తం చేశాయని ఆరోపించారు.
జవహర్ ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడుతూ, పదేళ్లపాటు ఈ పథకం కోసం పోరాడినా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో **రూ. 600 కోట్ల నిధులతో 30 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ పథకానికి అనుమతులు లభించాయని తెలిపారు. ఈ సందర్భంగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని పది స్థానాలకు తొమ్మిది చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించిన కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. సాగర్ నీళ్లు అందకపోతే రైతులు మళ్లీ జొన్నలు, కందులు పండించాల్సిన పరిస్థితి వస్తుందని భట్టి విక్రమార్క అన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రి వాకాటి శ్రీహరి మాట్లాడుతూ, గత పది సంవత్సరాల పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో పేదలను గత పాలకులు మోసం చేశారని, ప్రస్తుత ప్రజా ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తున్నామని అన్నారు. వరి పండించిన రైతులకు గిట్టుబాటు ధరతో పాటు క్వింటాల్ 500 రూపాయల బోనస్ ప్రభుత్వం అందించిందని గుర్తు చేశారు.
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా మన రైతులు పండించిన సన్న రకం ధాన్యాన్ని బియ్యం గా మార్చి పేద ప్రజలకు రేషన్ కార్డుల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నామని అన్నారు. వైద్య , విద్యా, వ్యవసాయ రంగాలలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు.
తక్కువ ఖర్చు 630 కోట్లతో 33 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేసే దిశగా జవహర్ ఎత్తిపోతల పథకం ప్రభుత్వం నిర్మిస్తుందని అన్నారు. పేదల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు బలోపేతం చేయాలని ఆయన కోరారు.
* ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగం.
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఈ పథకానికి రూ.630 కోట్లు మంజూరు అయ్యాయని, టెండర్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు మధిర నియోజకవర్గానికి గేమ్ ఛేంజర్ లాంటిదని ఆయన అభివర్ణించారు. దీన్ని ఏడాదిలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పథకం ద్వారా 33 వేల ఎకరాలకు నీరు అందుతుందని మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కొనియాడారు. కష్టకాలంలో భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీని నిలబెట్టారని, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కేసీఆర్‌ను గడగడలాడించారని గుర్తు చేసుకున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పు చేసిందని, ఆ అప్పులు తీరుస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని చెప్పారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల కృషి ఎంతో ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అందుకే భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావులకు కీలక పదవులు వచ్చాయని తెలిపారు. రాష్ట్రాన్ని నడిపించేది ఉమ్మడి ఖమ్మం జిల్లానే అని తాను, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భావిస్తుంటామని సరదాగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ముఖ్యమైన శాఖలు అన్నీ ఈ జిల్లా మంత్రుల దగ్గరే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం కమీషన్ల కోసమే ప్రాజెక్టు పనులను మధ్యలో ఆపివేసిందని విమర్శించారు.
*మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగం.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇందిరమ్మ అంటేనే పేదల ప్రభుత్వమని ఆయన అభివర్ణించారు. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టలేదని, సన్న బియ్యం కూడా పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. రూ. 12 వేల కోట్లతో ఆర్ అండ్ బి రోడ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి కేవలం ప్రజా సంక్షేమంపైనే ఉంటుందని, ఓట్లపై ఉండదని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఆయన ‘అపర భగీరథుడు’ అని పొగిడారు.
* మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రసంగం.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, దశాబ్ద కాలంగా నిలిచిపోయిన జవహర్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. నాగార్జునసాగర్ చివరి ఆయకట్టు రైతులకు నీరు అందించేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రణాళికలు రచించారని వివరించారు. ఈ ప్రణాళికలో భాగంగా నాగార్జునసాగర్ నీటిని పాలేరు రిజర్వాయర్ ద్వారా వైరాకు, అక్కడి నుంచి మధిర, ఎర్రిపాలెం మండలాలకు సాగునీరు, తాగునీరు అందిస్తారని చెప్పారు. అందుకోసమే రూ. 630.30 కోట్లతో ఈ పథకానికి శంకుస్థాపన చేశారని తెలిపారు.
అలాగే, సంక్షేమం, అభివృద్ధి పనులతో రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లు మంజూరు చేశామని, అర్హులైన పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని హామీ ఇచ్చారు. రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని, భూ భారతితో రైతులకు అనుకూలమైన చట్టం తెచ్చామని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి పేదవానికి సేవ చేస్తుందని భరోసా ఇచ్చారు.
ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వర రావు, ఇర్రిగేషన్ సీఈ రమేష్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.







