మందమర్రి / మంచిర్యాల, మహా :
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని మందమర్రి మండల తహసిల్దార్ కార్యాలయాన్ని తహసిల్దార్ సతీష్ కుమార్ తో కలిసి సందర్శించి రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సేవల కొరకు కార్యాలయానికి వచ్చే ప్రజల పట్ల గౌరవంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. వివిధ ధ్రువపత్రాల కొరకు కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులను నిబంధనలకు లోబడి పరిశీలించి నిర్ణీత గడువులోగా జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి వంటశాల, మధ్యాహ్న భోజన నాణ్యత, తరగతి గదులు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందిస్తుందని చెప్పారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని వివరించారు
ఉపాధ్యాయులు విధులలో సమయపాలన పాటించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యా బోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంతో పాటు వెంకటాపూర్ గ్రామంలో సబ్ స్టేషన్ ఏర్పాటు కొరకు స్థల పరిశీలన చేశారు. వెంకటాపూర్ గ్రామంలో నర్సరీని సందర్శించి మొక్కల సంరక్షణ పై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.






