భీమారం/మంచిర్యాల, మహా, సెప్టెంబర్ 22 : భీమారం మండల ప్రజలకు చేరువలో ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసినట్లు
రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖామంత్రి గడ్డం వివేకానంద అన్నారు. సోమవారం జిల్లాలోని భీమారం మండల కేంద్రంలో నూతనంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి రామ్ మోహన్, మండల తహసీల్దార్ వనజ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండల ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈరోజు ఈ కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని వెల్లడించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒకటొకటిగా నెరవేరుస్తున్నామని వివరించారు. 15వ ఆర్థిక ప్రణాళికలో 1 కోటి 43 లక్షల రూపాయల నిధులతో పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో భవన నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో ప్రజల సౌకర్యార్థం సి.సి. రోడ్లు, మురుగు నీటి వ్యవస్థ నిర్వహణకు చర్యలు తీసుకుంటూ, అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు, రేషన్ కార్డులు మంజూరు, సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. భీమారంలో 15 కోట్ల రూపాయలతో స్టేడియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. చెన్నూర్ నియోజకవర్గంలో రహదారుల నిర్మాణంలో అవసరమైన అటవీ అనుమతులు పొంది పనులు చేపట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. చెన్నూర్, కోటపల్లి మండలాలలో పంట సాగుకు అవసరమైన 500 టన్నుల యూరియా అదనంగా అందిస్తామని తెలిపారు. రైతులు ముందస్తుగా రబీ పంట కోసం కాకుండా అవసరం మేరకు యూరియా వినియోగించుకోవాలని సూచించారు. రామగుండం ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 10వేల కోట్ల రూపాయలతో ఎరువుల పరిశ్రమను తిరిగి ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలలో అవసరమైన యూరియా సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థలో గత సంవత్సరం 4 వేల 800 కోట్ల రూపాయల లాభం రాగా ఈ సంవత్సరం 6 వేల 340 కోట్ల రూపాయలు లాభం వచ్చిందని వివరించారు. రెగ్యులర్ కార్మికులకు 34 శాతం బోనస్, ఒప్పంద కార్మికులకు 5 వేల 500 రూపాయల బోనస్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని భీమారం మండల కేంద్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గ్రామీణ పేదల కొరకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. మండల ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని, ఇందులో భాగంగా అంబులెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సీజనల్ వ్యాధులకు వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా కృషి చేస్తామని, ఇందులో భాగంగా అవసరమైన ఫర్నిచర్, వైద్యులు, సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. జిల్లాలోని అన్ని మండలాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించడంతో పాటు జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలలో నిపుణులైన వైద్యుల ద్వారా ప్రత్యేక వైద్య చికిత్సలు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగా మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆశ్రమ పాఠశాలలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందిస్తున్నట్టు చెప్పారు
అనంతరం మండలంలోని 33 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వైద్యులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.






