మంచిర్యాల, మహా,సెప్టెంబర్ 22 : మంచిర్యాల జిల్లాలో బయో వ్యర్థాల నిర్వహణ శ్రద్ధగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లా
కలెక్టర్ సమావేశ మందిరంలో బయో వ్యర్థాల నిర్వహణపై మున్సిపల్ కమీషనర్లు, మున్సిపల్ ఇంజనీర్లు, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు, డెంటల్ అసోసియేషన్ ప్రతినిధులు, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది, వెంకటరమణ ఇన్సినరేటర్స్ ప్రతినిధులు, జిల్లా ఆసుపత్రి అధికారులు, తానా, తెలంగాణ వైద్య విధాన పరిషత్ అధికారులతో జిల్లా స్థాయి పర్యవేక్షక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బయో వ్యర్థాల నిర్వహణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్ లు, డెంటల్ క్లినిక్ లు బయో మెడికల్ వ్యర్థాలను వేరు చేయుట కొరకు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఇలా నమోదు చేసుకోని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. బయో మెడికల్ వ్యర్థాలను వేరు చేయుటకు 3 రంగులతో బకెట్లను ఏర్పాటు చేయాలని, పసుపు రంగు బకెట్ లో మానవ అవశేష వ్యర్థాలు, ఆపరేషన్ జరిగినప్పుడు తీసివేసిన భాగాలు, చీము, గడ్డలు, అంటువ్యాధులకు కారణమయ్యే వ్యర్థాలు, కాలం చెల్లిన మందులు, బ్లడ్ బ్యాగ్‌లు, ల్యాబ్ కల్చర్, స్పెసిఫిన్స్ వేయాలని, ఎరుపు రంగు బకెట్ లో ఐ.వి. సెర్చ్, బాటిళ్ళు, సిరంజ్‌లు, చేతి తొడుగులు, ప్లాస్టిక్ వ్యర్థాలను వేయాలని, నీలం రంగు బకెట్ లో వాడిన మెడిసిన్ వాయిల్స్, సూదులు, బ్లేడ్లు, లాన్సెట్స్ వేయాలని స్పష్టం చేశారు.
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో బయో మెడికల్ వ్యర్థాల నియమాలను పాటించాలని కోరారు. బయో మెడికల్ వ్యవస్థను వెంకటరమణ ఇన్సినరేటర్స్ కు అప్పగించాలని, అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు బయో మెడికల్ వ్యర్థాలను వేరు చేయుట కొరకు వెంకటరమణ ఇన్సినరేటర్స్, నిజామాబాద్ కాలుష్య నియంత్రణ మండలితో సమన్వయం చేసుకోవాలని వివరించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా ఎలాంటి వ్యర్థాలను బయట పడవేయ్యరాదని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు నివేదించాలని తెలిపారు. అనంతరం కార్యక్రమ సంబంధిత గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ కృపాబాయి, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు హరిశ్చంద్రారెడ్డి, నిజామాబాద్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ సమన్వయకర్త రంజిత్ కుమార్, వెంకటరమణ ఇన్సినరేటర్స్ -కరీంనగర్ సమన్వయకర్త తిరుపతి, ఐ. ఎం. ఎ. వైద్యులు డాక్టర్ సాల్మన్ రాజు, రవిప్రసాద్, శ్రీధర్, మున్సిపల్ కమీషనర్లు, ఎస్.ఓ. కాంతారావు, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.






