Mahaa Daily Exclusive

  భూసేకరణ, నష్ట పరిహారం చెల్లింపు శరవేగంగా చేపట్టాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి..!

Share

మంచిర్యాల, మహా, సెప్టెంబర్ 22 : జాతీయ రహదారుల నిర్మాణాలలో భాగంగా భూసేకరణ, నష్ట పరిహారం చెల్లింపు ప్రక్రియ శరవేగంగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, జాతీయ రహదారులు, అటవీ, ఇతర ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు, అదనపు కలెక్టర్లు (హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్), హైదరాబాద్ – విజయవాడ 6 వరుసల జాతీయ రహదారి- 65 రోడ్డు పనులు, హైదరాబాద్ నుండి అమరావతి, మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్, హైదరాబాద్ – శ్రీశైలం 4 వరుసల జాతీయ రహదారి 765 రోడ్డు పనులు, జాతీయ రహదారి 163 మన్నెగూడ సెక్షన్ 4 వరుసల రోడ్డు, హైదరాబాద్ – మంచిర్యాల 4 వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే కారిడార్ పనుల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపడుతున్న జాతీయ రహదారులు, గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా భూసేకరణ, నష్ట పరిహారం చెల్లింపు ప్రక్రియ శరవేగంగా చేపట్టాలని తెలిపారు. జాతీయ రహదారుల సంస్థ, రాష్ట్ర అధికారులు సమన్వయంతో పని చేస్తూ జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన జాతీయ రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ భూసేకరణ పూర్తి చేయాలని వెల్లడించారు. జాతీయ రహదారి 163జి పరిధిలో పెండింగ్ లో ఉన్న 130 హెక్టార్ల భూ బదలాయింపు ప్రక్రియ ప్రాధాన్యత క్రమంలో వేగవంతం చేయాలని అన్నారు. రహదారి పరిధిలో ఉన్న జిల్లాల కలెక్టర్లు ప్రత్యేకంగా ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని వివరించారు. భూసేకరణ ప్రక్రియలు కలెక్టర్లు నేరుగా రైతులతో చర్చించాలని చెప్పారు. భూ నిర్వాసితులకు జాతీయ రహదారుల సంస్థ ద్వారా మెరుగైన పరిహారం అందించేందుకు కృషి చేయాలని తెలిపారు. రహదారుల నిర్మాణాలలో అవసరమైన అటవీ శాఖ అనుమతులు, కోర్టు కేసులను త్వరగా పరిష్కరించి సంబంధిత యజమానులకు నష్టపరిహారం అందించాలని కోరారు. జాతీయ రహదారుల నిర్మాణంలో భూసేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత రహదారులు రవాణా- జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ద్వారా రాష్ట్రపతి పేరిట ముటేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అటవీ శాఖలోని వన్యప్రాణి సంరక్షణ పరిధిలోని రాని భూములకు సంబంధించి అనుమతులను త్వరగా మంజూరు చేసేలా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ భూములకు బదులుగా అటవీ ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జాతీయ రహదారి 163జి పరిధిలో 3వ విడత ఆర్బిట్రేషన్ కొరకు దాఖలు చేసిన 114 కేసులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. జాతీయ రహదారి 63 కు సంబంధించి జిల్లాకు చెందిన 17 గ్రామాలలో కోర్టు స్టే కలిగిన గ్రామాలను మినహాయించి మిగిలిన గ్రామాలలో అవార్డు జారీ చేయడం జరిగిందని తెలిపారు. అక్టోబర్ 30వ తేదీలోగా ప్రక్రియ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాసరావు, జాతీయ రహదారుల సంస్థ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest