మంచిర్యాల, మహా : స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, రాజస్వ మండల అధికారులు, పోలీస్ అధికారులు, ఎన్నికల అధికారులతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన వచ్చినందున నిర్వహణకు కావలసిన ఏర్పాట్లు, బందోబస్తు, అధికారులు, సిబ్బంది నియామకం, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, రక్షణ ఏర్పాట్లు ఇతర ఎన్నికల అంశాలకు సంబంధించి అధికారులు ఎన్నికల సంఘం నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసే ప్రచార అంశాలను వెంటనే తొలగించాలని, మీడియాలో వచ్చే ప్రకటనలు, సోషల్ మీడియాలో ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. జెడ్.పి.టి.సి., ఎం.పి.టి.సి. ఎన్నికలు ప్రతి జిల్లాలో రెండు విడతలలో నిర్వహించడం జరుగుతుందని, సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు ఎంపిక చేయబడిన జిల్లాలలో మూడు విడతలుగా, మిగతా జిల్లాలలో రెండు విడతలుగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నోటీసు జారీ, ఓటర్ల జాబితా ప్రదర్శన, నామినేషన్ల దాఖలు, పరిశీలన, చెల్లుబాటయ్యే నామినేటెడ్ అభ్యర్థుల జాబితా, అప్పీలు, అప్పీళ్ల పరిష్కరణ, అభ్యర్థిత్వం ఉపసంహరణ, పోటీ చేయు అభ్యర్థుల జాబితా ప్రచురణ, పోలింగ్ నిర్వహణ, రీపోల్ ఉన్నట్లయితే సంబంధిత ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు, ప్రకటన ప్రతి అంశాన్ని ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల నిర్వహణ సజావుగా చేపట్టాలని తెలిపారు. అనంతరం
రాష్ట్ర అదనపు డి.జి.పి. మహేష్ భగవత్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలని, ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి చర్యలకు తావు లేకుండా బందోబస్తు నిర్వహించాలని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ భద్రత, సి. సి. టివి పర్యవేక్షణ, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన విడుదలైనందున రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని అధికారుల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో అక్టోబర్ 23వ తేదీన నిర్వహించు మొదటి విడత ఎన్నికలలో 9 జెడ్.పి.టి.సి., 62 ఎం.పి.టి.సి. స్థానాలకు, అక్టోబర్ 27వ తేదీన నిర్వహించు రెండవ విడత ఎన్నికలలో 7 జెడ్.పి.టి.సి., 67 ఎం.పి.టి.సి. స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సర్పంచ్, వార్డు సభ్యులకు జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మొదటి విడతలో 7 మండలాలలో 114 సర్పంచ్, 996 వార్డు మెంబర్లకు, రెండవ విడతలో 5 మండలాలలో 102 సర్పంచ్, 868 వార్డు సభ్యులకు, మూడవ విడతలో 4 మండలాలలో 90 సర్పంచ్, 816 వార్డు మెంబర్లకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మొత్తంగా జిల్లాలోని 306 గ్రామపంచాయతీలలో 2 వేల 680 వార్డులు, 306 గ్రామాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కొరకు రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ అందించడం జరిగిందని, మరొకసారి శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో వివిధ విభాగాలకు సంబంధించిన నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, పోలీసు శాఖ అధికారులు సరిపడా అందుబాటులో ఉన్నారని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి.సి.పి. ఎ. భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, నోడల్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.






