మంచిర్యాల, మహా : పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లాలో జెడ్ పి టి సి, ఎం పి టి సి ఎన్నికలు 2 విడతలలో, సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు 3 విడతలలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, 24 గంటలలో ప్రభుత్వ కార్యాలయాలలో, 48 గంటలలో పబ్లిక్ ప్లేసెస్ లలో, 72 గంటలలో పూర్తిగా రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సంబంధిత అంశాలను తొలగించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు సంబంధిత అధికారుల నుండి అనుమతులు తప్పనిసరిగా పొందాలని, సరైన అనుమతి లేకుండా నిర్వహించకూడదని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఫ్లయింగ్ సర్వేయలెన్సు టీం, స్టాటిస్టిక్స్ సర్వేయాలెన్స్ టీం లను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని, నోడల్ అధికారులు, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ అందించడం జరిగిందని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్, బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్ ఇతర ఎన్నికల సంబంధిత ప్రతి అంశంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని, పెయిడ్ న్యూస్ సంబంధించి ప్రత్యేకంగా పర్యవేక్షించి సంబంధిత రాజకీయ పార్టీ/ అభ్యర్థి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. పోలీస్, సంబంధిత శాఖల సమన్వయంతో సాధారణ పంచాయతీ ఎన్నికలను నిష్పక్షపాతంగా, స్వేచ్ఛ వాతావరణంలో శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.






