Mahaa Daily Exclusive

  స్థానిక ఎన్నికలు స‌జావుగా నిర్వ‌హించాలి-క‌లెక్ట‌ర్ అధికారులు , రాజ‌కీయ ప్రతినిధులతో సమావేశం. అమ‌లులో ఎన్నిక‌ల కోడ్..!

Share

ఆదిలాబాద్ మ‌హా : ఎంపీటీసీ, జడ్పిటిసి, గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసామ‌ని,జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల నియమావళి) అమలు లో ఉందని జిల్లా క‌లెక్ట‌ర్ రాజ‌ర్షి షా అన్నారు .మంగ‌ళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థ‌ల ఎన్నికల సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ట్రైనీ కలెక్టర్ సలోని, వివిధ రాజకీయ పార్టీల‌ ప్రతినిధులతో కలిసి సమావేశం నిర్వహించారు..
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ..జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రభుత్వ ఆదేశాలు నిబంధనల ప్రకారం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లాలో మొత్తం 20 జ‌డ్పీటీసీలు, 166 యంపీటీసీలు, 473 గ్రామ పంచాయితీలు,3870 వార్డులకు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌న్నారు.

ప‌రిష‌త్ ఎన్నిక‌లు ( రెండు విడ‌త‌ల్లో)

ప‌రిషత్ ఎన్నికలకు సంబంధించి మొదటి విడతలో బజార్ హత్నూర్, భీంపూర్, బోథ్, ఇచ్చోడ, గుడిహత్నూర్, నేరడిగొండ,సిరికొండ, సొనాల, తలమడుగు, తాంసి మండలాలు, రెండో విడతలో ఆదిలాబాద్ రూరల్, బేల, భోరజ్, జైనథ్, మావల, సాత్నాల, గాదిగూడ, నార్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియలకు సంబంధించి తదుపరి షెడ్యూల్ ఎన్నికల సంఘం నుంచి జారీ కానుంది.

స‌ర్పంచ్ ల ఎన్నిక‌లు ( మూడు విడ‌త‌ల్లో)

మొద‌టి ఫేజ్ లో ఉట్నూర్, అదిలాబాద్ రెవెన్యు డివిజన్ పరిధిలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూరు, గాదిగూడ, సిరికొండ, ఇచ్చోడ మొత్తం గ్రామ‌పంచాయితీలు 166, వార్డులు 1390 ,పోలింగ్ కేంద్రాలు 1408
రెండో ఫేజ్ లో అదిలాబాద్ డివిజన్ పరిధిలోని అదిలాబాద్, మావల, బేల, జైనథ్, సాత్నాల, భోరజ్, తాంసి, భీంపూర్ మొత్తం గ్రామ‌పంచాయితీలు 156, వార్డులు 1260, పోలింగ్ కేంద్రాలు 1260
మూడో ఫేజ్ లో అదిలాబాద్ డివిజన్ లోని బోథ్, సోనాల, బజార్ హత్నూర్, నేరడిగొండ, గుడిహత్నూర్, తలమడుగు మొత్తం గ్రామ‌పంచాయితీలు 151, వార్డులు 1220, పోలింగ్ కేంద్రాలు 1220
మూడు ఫేజ్ ల‌లో క‌లిపి మొత్తం 473 గ్రామ‌పంచాయితీలు 3870 వార్డులకు గాను 3888 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు. 3755 జంబో బ్యాలెట్ బాక్స్ లు , 145 మీడియం బాక్సులు, 2915 స్మాల్ బాక్స్ లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రూరల్ ఓటర్లు పురుషులు 219652, స్రీలు 230313, ఇతరులు16, మొత్తం 449981 ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోనున్న‌ట్టు తెలిపారు.

ఎన్నిక‌ల అధికారులు

స్టేజ్ 1 లో 141 రిటర్నింగ్ అధికారుల‌కు 141 అసిస్టెంట్ ఆర్వోలను నియమించి ఇప్పటికే శిక్షణ ఇచ్చిన‌ట్టు తెలిపారు.అలాగే స్టేజ్ 2 లో 549 రిటర్నింగ్ అధికారులకు 4 క్లస్టర్లలో శిక్షణ పూర్తి చేసిన‌ట్టు తెలిపారు. 1515 ప్రిసైడింగ్ అధికారులు , 3751ఇతర పోలింగ్ అధికారుల‌కు అక్టోబర్ 6వ తేదిన శిక్షణ ఇవ్వనున్న‌ట్టు తెలిపారు. జిల్లాలో మూడు దఫాలుగా నిర్వహించే గ్రామపంచాయతీ ఎన్నికలకు ఆర్వోలు, అసిస్టెంట్ ఆర్వోలు , పోలింగ్ కేంద్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించడం కోసం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.ఎన్నికల నియమావళి అనుసరించి జిల్లా స్థాయి అధికారులు అందరిని నోడల్ అధికారులుగా నియమించి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల నియమావళిని తూచ తప్పకుండా పాటించాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన వచ్చినందున నిర్వహణకు కావలసిన ఏర్పాట్లు, బందోబస్తు, అధికారులు, సిబ్బంది నియామకం, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, రక్షణ ఏర్పాట్లు ఇతర ఎన్నికల అంశాలకు సంబంధించి అధికారులు ఎన్నికల సంఘం నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసే ప్రచార అంశాలను వెంటనే తొలగించాలని, మీడియాలో వచ్చే ప్రకటనలు, సోషల్ మీడియాలో ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. జెడ్.పి.టి.సి., ఎం.పి.టి.సి. ఎన్నికలు ప్రతి జిల్లాలో రెండు విడతలలో నిర్వహించడం జరుగుతుందని, సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు ఎంపిక చేయబడిన జిల్లాలలో మూడు విడతలుగా, మిగతా జిల్లాలలో రెండు విడతలుగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నోటీసు జారీ, ఓటర్ల జాబితా ప్రదర్శన, నామినేషన్ల దాఖలు, పరిశీలన, చెల్లుబాటయ్యే నామినేటెడ్ అభ్యర్థుల జాబితా, అప్పీలు, అప్పీళ్ల పరిష్కరణ, అభ్యర్థిత్వం ఉపసంహరణ, పోటీ చేయు అభ్యర్థుల జాబితా ప్రచురణ, పోలింగ్ నిర్వహణ, రీపోల్ ఉన్నట్లయితే సంబంధిత ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు, ప్రకటన ప్రతి అంశాన్ని ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల నిర్వహణ సజావుగా చేపట్టాలని ఆదేశించారు

Latest