- తెలంగాణ రోడ్లు దేశానికే రోల్ మోడల్
- హ్యామ్ విధానంలో ఆర్ అండ్ బీ రోడ్లకు మహర్దశ
- మూడేళ్లలో పూర్తి స్థాయిలో నిర్మించాలని ప్రణాళికలు
- ఆర్ అండ్ బీ శాఖ సమీక్షలో భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్, మహా: హ్యామ్ విధానంలో ఆర్ అండ్ బీ రాష్ట్ర రోడ్లకు మహర్దశ పట్టనుంది. దశల వారీగా 3 సంవత్సరాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆర్ అండ్ బీ రోడ్లను పూర్తి స్థాయిలో నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. ఈ రోడ్ల నిర్మాణంలో దేశానికే రోల్ మోడల్ గా నిలపాలనే ప్రభుత్వ లక్ష్యం. ప్రధానంగా ప్రమాద రహిత రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గురువారం రాష్ట్ర సచివాలయంలో హ్యామ్ రోడ్ల నిర్మాణంపై ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో కీలక సమావేశం నిర్వహించారు. హ్యామ్ రోడ్ల ప్రపోజల్స్ కు సంబంధించిన వివరాలను స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దశల వారీగా హ్యామ్ రోడ్ల నిర్మాణాలు త్వరితగతిన చేపట్టాలని తెలిపారు. ట్రాఫిక్ సర్వే నిర్వహించి ఏ రహదారులపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉందో ఆ రహదారులను విస్తరించి, పునరుద్దరించాలని సూచించారు. ప్రాధాన్య క్రమంలో ఈ రోడ్లను జాబితాలో చేర్చాలని అన్నారు. వీటి నిర్మాణ క్రమంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని అన్నారు. రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. హ్యామ్ ద్వారా వచ్చే 3 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ అండ్ బీ రోడ్డు అద్దంలా చేయనున్నామని తెలిపారు. దేశానికి రోల్ మోడల్ గా నిలపాలనే లక్ష్యంతో ఆర్ అండ్ బీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామని అన్నారు. యాక్సిడెంట్స్ ఫ్రీ రోడ్ల నిర్మాణంపై ప్రధాన దృష్టి సారించామని చెప్పారు. ఫేజ్ ల వారీగా హ్యామ్ రోడ్లు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. మొదటి ఫేజ్ లో సింహ భాగం హ్యామ్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అందులో సింగిల్ లేన్, డబుల్ లేన్, 4 లేన్ల వారీగా రోడ్ల బలోపేతం చేయనున్నామని, దీంతో పాటు రోడ్ల విస్తరణ చేయనున్నట్లు తెలిపారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి 4 లేన్ రోడ్ల నిర్మాణం చేయాలని ప్రభుత్వం ధృఢ సంకల్పంతో ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. ఇందులో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇంకో అసెంబ్లీ నియోజకవర్గానికి కనెక్టివిటీ కారిడార్లుగా హ్యామ్ రోడ్లు నిర్మిస్తున్నామని వివరించారు. మొదటి ఫేజ్ కు ఒకటి, రెండు నెలల్లో టెండర్లు పిలవనున్నట్లు మంత్రి వెల్లడించారు.
హ్యామ్ విధానంలో మొదటి ఫేజ్ లో 5,587 కిలోమీటర్ల రహదారుల పునరుద్దరణకు రూ.10,986 కోట్లు ఖర్చు చేసేందుకు అంచనాలు రూపొందించారు. వీటిలో రూ.4,416 కోట్లతో సింగిల్ లేన్, డబుల్ లేన్, 4 వరుసల రహదారులు నిర్మించేందుకు ఖర్చు చేయనున్నారు. రూ.4,416 కోట్లతో మొత్తం 3,792 కిలోమీటర్ల రోడ్లను పునరుద్దరించనున్నారు. 1,795 కిలోమీటర్ల విస్తరణ పనుల కోసం రూ.6,569 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనాలు వేశారు. ప్రధానంగా మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రెండు వరుసల రోడ్లు, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి నాలుగు వరుసల రోడ్లు నిర్మాణం చేయాలని రోడ్డు భవనాల శాఖ సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచింది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కాగానే హ్యామ్ రోడ్లకు సంబంధించిన టెండర్లు ఖరారు చేయడం, పనుల కేటాయింపు తదితర పనులు మొదలు పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.








