Mahaa Daily Exclusive

  స్టే పై సుప్రీం కోర్టుకు వెళ్లండి:తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్

Share

  • స్టే పై సుప్రీం కోర్టుకు వెళ్లండి
  • కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతిపై న్యాయ పోరాటం చేయాలి
  • ఎక్స్ వేదికగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్

హైదరాబాద్, మహా: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవో, ఎన్నికల నోటిఫికేషన్‌ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును రేవంత్ సర్కార్ ఆశ్రయించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిందని.. ఇకనైనా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లతోపాటు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం తెలిపి 6 నెలలు గడిచిందని గుర్తు చేశారు. ఈ రెండు బిల్లులు రాష్ట్రపతి వద్దకు చేరినా ఆమోదం పొందలేదని తెలిపారు. ఈ బిల్లుల చట్టబద్ధత కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిన్న ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు. 2018 పంచాయతీ రాజ్ చట్టానికి సవరణ చేసి బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే సవరణ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉందని చెప్పారు. అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బిల్లులు రాష్టప్రతి వద్ద, చట్ట సవరణ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండగానే రేవంత్ సర్కార్ తెచ్చిన జీవో నం.9 పై హైకోర్టు స్టే విధించిందని పేర్కొన్నారు. శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో హైకోర్టు ఉత్తర్వుల కాపీ అందిందని చెప్పారు. అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బిల్లులను ఆరు నెలలుగా కోల్డ్ స్టోరేజీలో పెట్టిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేయాలని పేర్కొన్నారు.