Mahaa Daily Exclusive

  భూ వివాదాల్లేని తెలంగాణే లక్ష్యం:రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Share

 

హైదరాబాద్, మహా : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ప్రతి భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నంబర్‌కు భూదార్ గుర్తింపు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలోని త‌న కార్యాల‌యంలో రీ సర్వే జరుగుతున్న గ్రామాల్లో పురోగతి, ప్రజల స్పందన, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ, స‌ర్వే అధికారులతో స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేసిన 2,240 గ్రామాల్లో రీ సర్వే కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఈ రీ స‌ర్వేపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించాలని, రీ సర్వే వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు, భూ యజమానులకు వివరించాలని అధికారులకు సూచించారు. ప్రజల సహకారంతోనే ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని తెలిపారు. రీ సర్వే జరుగుతున్న ప్రతి గ్రామంలో అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, ప్రజలు వ్యక్తం చేసే సందేహాలను వెంటనే నివృత్తి చేయాలని మంత్రి ఆదేశించారు. భూముల హద్దుల నిర్ధారణలో పారదర్శకత పాటిస్తూ ప్రతి దశలో ప్రజలను భాగ‌స్వాములుగా చేయాల‌ని సూచించారు. రీ సర్వే పనులను కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని, వారానికోసారి పురోగతిని సమీక్షించాలని ఆదేశించారు. రెవెన్యూ, సర్వే శాఖ అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేసి నిర్ణీత లక్ష్యాలను సాధించాలని చెప్పారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.