Mahaa Daily Exclusive

  బీసీ రిజర్వేషన్లు.. మా హక్కు … ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఇచ్చేవి కాదు: కోదండరాం

Share

  • బీసీ రిజర్వేషన్లు.. మా హక్కు
  • ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఇచ్చేవి కాదు: కోదండరాం
  • గల్లీ నుండి ఢిల్లీ స్థాయి వరకు జరిగే పోరాటంలో కలిసి రండి: ఆర్. కృష్ణయ్య
  • బీసీ సంఘాల తెలంగాణ బంద్ పోస్టర్స్‌ ఆవిష్కరించిన బీసీ సంఘాల నేతలు

హైదరాబాద్, మహా: రిజర్వేషన్లు బీసీల హక్కు అని, దయా దాక్షిణ్యాల మీద ఇచ్చేవి కాదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. సమానత్వపు పునాదులపై కొత్త సమాజం ఏర్పాటు చేసేందుకే అవి ఉన్నట్లు చెప్పారు. మంగళవారం బీసీ సంఘాల తెలంగాణ బంద్ పోస్టర్స్‌ని ఆర్.కృష్ణయ్య, కోదండరాం, జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘాల నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్ల సాధన కోసం ప్రొఫెసర్‌ పీఎల్‌. విశ్వేశ్వర్‌రావు నేతృత్వంలో ఒక సబ్‌ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇతర సంఘాలతో కలిసి ఈ కమిటీ కృషి చేస్తుందన్నారు. ‘‘ రిజర్వేషన్ల అంశంపై కొన్ని పార్టీలు ద్వంద వైఖరి అవలంబిస్తున్నాయి. కేసులు వేసిన వ్యక్తులకు మద్దతు తెలుపుతూ.. బీసీలకు అన్యాయం జరిగిందని ప్రచారం చేస్తున్నాయి. తెజసకి రెండు నాలుకల ధోరణి లేదు. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. కేంద్రంపైన ఒత్తిడి తీసుకొచ్చి బీసీ బిల్లును ఆమోదించేందుకే మా పోరాటం’’ అని అన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ర్యాలీలు, సమావేశాలు, ధర్నాలు నిర్వహిస్తామని తెజస ఉపాధ్యక్షుడు పీఎల్‌. విశ్వేశ్వర్‌రావు అన్నారు. సుప్రీం కోర్టులో న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. 16న గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందజేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లపై తెజస పలు తీర్మానాలు చేసింది. బీసీ సంఘాలు 18న నిర్వహించే బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించింది.

గల్లి నుండి ఢిల్లీ స్థాయి వరకు పోరాటం..
బీసీల వాదన వినకుండా తెలంగాణ హైకోర్టు ఏకపక్షంగా స్టే ఇచ్చిందని ఎంపీ, బీసీ రిజర్వేషన్స్ సాధన సమితి కన్వీనర్ ఆర్.కృష్ణయ్య వ్యాఖ్యానించారు. ఆర్.కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్స్‌పై హైకోర్టు స్టే ఇవ్వడంతో న్యాయం జరుగలేదని పేర్కొన్నారు. హైకోర్టు స్టే ఇచ్చి బీసీల నోటికాడి ముద్దను లాక్కుందని విమర్శించారు. బీసీలకు అవమానం, అన్యాయం జరిగిందని వ్యక్తం చేశారు. సామాజిక ఉద్యమాలకు మద్దతుగా నిలుస్తున్న కోదండరాం బీసీల ఉద్యమానికి అండగా ఉండాలని కోరారు. గల్లి నుండి ఢిల్లీ స్థాయి వరకు జరిగే పోరాటంలో తమతో కలిసి రావాలని ఆయన కోరారు.

Latest