- జూబ్లీహిల్స్‌పై కేసీఆర్ నజర్
- ఫామ్ హౌస్‌లో కేటీఆర్, హరీశ్ రావు భేటీ
- ఉప ఎన్నిక రోడ్‌షోలు, ప్రచార వ్యూహాలపై చర్చలు
- తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపైనా మంతనాలు
- జూబ్లీహిల్స్‌లోని వివిధ ప్రాంతాల ఇన్‌ఛార్జ్‌లతో నేడు కేసీఆర్ సమావేశం
హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులతో సమావేశమయ్యారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి సంబంధించి 40 మంది నాయకులతో బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో కేసీఆర్ పేరు కూడా ఉండటంతో… ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ప్రచారంలో పాల్గొంటారని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ తమ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయడంపై చర్చించేందుకు కేటీఆర్, హరీష్ రావులు బుధవారం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ప్రచార వ్యూహాలపై వారు చర్చలు జరిపారు. అలాగే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై కూడా వారు చర్చించినట్టుగా సమాచారం. ఇక, జూబ్లీహిల్స్‌లోని వివిధ ప్రాంతాల బీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్‌లతో కేసీఆర్ గురువారం రోజుు సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా పార్టీ ప్రచార వ్యూహాలపై వారికి ఆయన దిశానిర్దేశం చేయనున్నారు






