Mahaa Daily Exclusive

  సీనియర్లకు బైబై …కర్ణాటకలో కామరాజ్‌ ప్లాన్..

Share

  • సీనియర్లకు బైబై
  • కర్ణాటకలో కామరాజ్‌ ప్లాన్
  • .కాంగ్రెస్ ముమ్మర కసరత్తు
  • సగం కేబినెట్ లో కొత్త రక్తం

బెంగళూరు, మహా : కాంగ్రెస్ హైకమాండ్ సంచలనాలకు సై అంటోంది. పార్టీ యువరక్తాన్ని నింపేందుకు.. కీలక బాధ్యతల్లో యువతకు అవకాశం కల్పించేందుకు సన్పద్దమవుతోంది. ముందుగా కర్ణాటకలో కీలక మార్పులు, చేర్పులు చేపట్టేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధమవుతోంది. ఇందుకోసం కామరాజ్ ప్లాన్ ను అమలు చేసే యోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ ప్రకారం పనితీరు, అవినీతి ఆరోపణల ఆధారంగా పలువురు సీనియన్ నేతలకు రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకనుంది. ఈ ఏడాది చివర్లో చేపట్టే ఈ మార్పులు, చేర్పుల్లో సుమారు డజను మంది సీనియర్ మంత్రులను తప్పించి, వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకోనుండటం, రొటేషనల్‌ పద్ధతిలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు పదోన్నత కల్పించనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వస్థీకరణ ఖాయంగా జరగనుంది. కామరాజ్ ప్లాన్‌ను కర్ణాటకలో అమలు చేస్తే డీకే సైతం ప్రస్తుతం ఉన్న రెండు పదవుల్లో ఒక దానికే పరిమితం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయన ఉపముఖ్యమంత్రి పదవితోపాటు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు.

పార్టీ పునర్నిర్మాణమే కామరాజ్ ప్లాన్

ప్రముఖ రాజకీయ నేత అయిన కుమారస్వామి కామరాజ్ (1903-1975) స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడంతోపాటు అప్పటి మద్రాస్ స్టేట్ (ప్రస్తుతం తమిళనాడు)కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడుగానూ ఉన్నారు. భారత రాజకీయాల్లో ‘కింగ్‌మేకర్‌’గా ఆయన పేరు తెచ్చుకున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ ప్రధానమంత్రులు కావడంలో కీలకపాత్ర పోషించారు. 1963లో అప్పటి మద్రాస్ ముఖ్యమంత్రిగా ఉన్న కామరాజ్ ఆ తర్వాత ఐఎన్‌సీ(ఓ) అధ్యక్షుడయ్యారు. పార్టీ పునర్నిర్మాణం కోసం సీనియర్ నేతలు ప్రభుత్వ పదవుల నుంచి తప్పుకోవాలని కామరాజ్ ప్రతిపాదించారు. పార్టీ ఆర్గనైజేషన్‌ను అట్టడుగు స్థాయి నుంచి పటిష్టం చేయడం ఈ ప్లాన్ ముఖ్యోద్దేశం. అందులో భాగంగా కామరాజ్ ప్లాన్ ను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోంది. స్తబ్దత ఏర్పడినపుడల్లా కామరాజ్ ప్లాన్ ను అమలుచేయడం ఆనవాయితీగా కాంగ్రెస్ లో జరుగుతోంది. కర్నాటక తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా దీనిని అమలుచేసే అవకాశాలున్నాయి.

Latest