Mahaa Daily Exclusive

  రాష్ట్రాన్ని గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా మార్చుతాం..ఆస్‌బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025’లో ప్రసంగించిన మంత్రి

Share

  • రాష్ట్రాన్ని గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా మార్చుతాం
  • 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు చేర్చాలన్నదే లక్ష్యం
  • కొత్తగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులు, 5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం
  • మా నినాదం మేడిన్ ఇండియా కాదు.. ఇన్వెంట్ ఇన్ తెలంగాణ: శ్రీధర్ బాబు
  • ‘ఆస్‌బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025’లో ప్రసంగించిన మంత్రి

మెల్‌బోర్న్‌: లైఫ్ సైన్సెస్‌లో 2030 నాటికి కొత్తగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ అత్యున్నత నిర్ణాయక సంస్థ ‘ఆస్‌బయోటెక్’, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త నిర్వహణలో మెల్ బోర్న్‌లో నిర్వహిస్తున్న ‘ఆస్‌బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025’లో ఆయన గురువారం కీలకోపన్యాసం చేశారు. రెండేళ్లలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన పురోగతి, భవిష్యత్తు ప్రణాళికలు, అవకాశాలు, పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. తెలంగాణను “గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్”గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను మంత్రి వెల్లడించారు. భౌగోళికంగా 11వ స్థానం, జనాభాలో 12వ స్థానంలో ఉన్నప్పటికీ, దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో తెలంగాణ వాటా 5 శాతం కంటే ఎక్కువగా ఉందని మంత్రి శ్రీ శ్రీధర్ బాబు తెలిపారు. 2024-2025లో తెలంగాణ జీఎస్ డీపీ వృద్ధి రేటు 8.2 శాతం కాగా, జాతీయ సగటు కేవలం 7.6 శాతం మాత్రమే ఉందన్నారు. గత 20 నెలల కాలంలో కొత్తగా రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాగా, ఇందులో లైఫ్ సైన్సెస్ రంగం వాటా రూ.63వేల కోట్లు అని చెప్పారు. లైఫ్ సైన్సెస్ ఎగుమతులు గతేడాది ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలోనే రూ.26వేల కోట్ల మార్కును దాటాయన్నారు.

త్వరలోనే కాంప్రహెన్సివ్ లైఫ్ సైన్సెస్ పాలసీ..
తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం ఆర్థిక వ్యవస్థ విలువను ప్రస్తుతం ఉన్న 80 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం త్వరలోనే “కాంప్రహెన్సివ్ లైఫ్ సైన్సెస్ పాలసీ”ని అందుబాటులోకి తెస్తామన్నారు. మా నినాదం మేడిన్ ఇండియా కాదు… ఇన్వెంట్ ఇన్ తెలంగాణ అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. లైఫ్ సైన్సెస్ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన “ఎకో సిస్టం” తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తుందన్నారు. జీనోమ్ వ్యాలీ, మెడికల్ డివైసెస్ పార్క్, బీ హబ్, భారత్ ఫ్యూచర్ సిటీ, పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించే ప్రగతిశీల, ప్రోత్సాహకర విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ప్లగ్-అండ్-ప్లే పారిశ్రామిక పార్కులు, అనుమతుల కోసం సింగిల్ విండో సిస్టమ్, దేశంలోనే సాటి లేని స్టెమ్ టాలెంట్, స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం, ఎక్కడైనా సులభంగా చేరుకునేలా రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో విక్టోరియా రాష్ట్ర మంత్రులు రోస్ స్పెన్స్, డానీ పియర్సన్ ఎంపీ, ఆస్ బయోటెక్ ఛైర్మన్ డా. జేమ్స్ క్యాంప్‌బెల్, తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ సెల్ డైరెక్టర్ మధుసూదన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు