- చేనేత కళా వైభవానికి వేదికగా గా నిలిచిన హైదరాబాద్ శారీ ఫెస్టివల్.
- మంత్రి తుమ్మల చేతుల మీదుగా..హైదరాబాద్ శారీ ఫెస్టివల్’ ప్రారంభం
- ఆకట్టుకుంటున్న సంప్రదాయ చీరల కలెక్షన్.
- ప్రదర్శన ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.
హైదరాబాద్,మహా.
భారతీయ చేనేత కళా వైభవానికి హైదరాబాద్ మరోసారి వేదిక అయింది. రంగు రంగుల చేనేత చీరలతో నగరం కళకళలాడుతుంది. ఈ అద్భుత కళాత్మక ప్రదర్శనకు కేరాఫ్ గా నిలిచిన ‘హైదరాబాద్ శారీ ఫెస్టివల్’ను చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ప్రారంభించారు. ఈ ఫెస్టివల్ ఈనెల 30వ తేదీ వరకు ఆమీర్‌పేట్‌లోని కమ్మ సంఘం ప్రాంగణంలో జరగనుంది. ఈ ప్రారంభోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్ట్ బోర్డు సభ్యులు జీ భాను ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ వేడుక నేషనల్ డిజైన్ సెంటర్, డెవలప్‌మెంట్ కమిషనర్ (హ్యాండ్‌లూమ్స్), టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ మద్దతుతో నిర్వహిస్తున్నారు. వారం పాటు జరిగే ఈ ఉత్సవం ప్రతి రోజు ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది.
ఈ ప్రదర్శనలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 62 మంది చేనేత కళాకారులు, 13 మంది హ్యాండీక్రాఫ్ట్ కళాకారులు తమ కళాత్మకతను ప్రదర్శించనున్నారు. ఈ ఉత్సవంలో దేశ నలుమూలల నుంచి తెచ్చిన సంప్రదాయ చీరల కలెక్షన్ ఆకట్టుకోనుంది.
ఇది దేశంలోని ప్రాంతీయ చేనేత సంప్రదాయ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
ఉత్తరప్రదేశ్ నుంచి బెనారస్ చీరలు, ఆంధ్రప్రదేశ్ నుంచి కాటన్ బుట్టా, కలంకారీ చీరలు, ఛత్తీస్‌గఢ్ నుంచి కోసా చీరలు, గుజరాత్ నుంచి పటోలా చీరలు, బిహార్ నుంచి భగల్పూర్ సిల్క్ చీరలు, తెలంగాణ నుంచి హ్యాండ్‌లూమ్ సిల్క్ చీరలు, ఒడిశా నుంచి ఇకాట్ చీరలు, మధ్యప్రదేశ్ నుంచి చందేరీ చీరలు, మహారాష్ట్ర నుంచి పైథాణీ చీరలు, ఝార్ఖండ్ నుంచి తుస్సర్ సిల్క్ చీరలు, రాజస్థాన్ నుంచి కోటా డోరియా చీరలు, తెలంగాణ నుంచి పొచంపల్లి ఇక్కత్ కాటన్, సిల్క్ చీరలు ప్రదర్శనలో ఉంటాయి.
ప్రతి చీర భారతీయ చేనేత వారసత్వంలోని కళాత్మకత, సంప్రదాయం, సాంస్కృతిక సంపదను ప్రతిబింబించనుంది.
హైదరాబాద్ శారీ ఫెస్టివల్ కేవలం ప్రదర్శన మాత్రమే కాదు. ఇది ఒక సాంస్కృతిక పరస్పర మాధ్యమం.
సందర్శకులు నేరుగా చేనేత కళాకారులతో మాట్లాడి, వీటి సౌందర్యాన్ని అర్థం చేసుకునే అవకాశం కలదు.
సంప్రదాయ డిజైన్‌లు, సూక్ష్మ నేత పద్ధతులు, ప్రాంతీయ ప్రత్యేకతలు తెలుసుకోవచ్చు. చేనేత చీరలను ప్రోత్సహించడం, కళాకారులకు మార్కెట్ అవకాశాలు కల్పించడం, ఫ్యాషన్‌పై అవగాహన కల్పించడం ఈ ప్రదర్శన ప్రధాన లక్ష్యం








