Mahaa Daily Exclusive

  సీఎం రేవంత్.. కటింగ్ మాస్టర్:హరీశ్ రావు

Share

  • సీఎం రేవంత్.. కటింగ్ మాస్టర్
  • కేసీఆర్ కట్టిన వాటికి రిబ్బన్ కట్ తప్ప ఏమీ లేదు
  • బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు

హైదరాబాద్, మహా: కాంగ్రెస్‌ది ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకిల మోతా అని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో వడ్డెర సంఘం నాయకులతో ఆదివారం జరిగిన సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం వడ్డెర సమాజానికి సహాయం చేసిందని చెప్పారు. సిద్దిపేటలో ట్రాక్టర్లు అందించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొరం కొట్టుకునే వడ్డెర సోదరులపై అక్రమ కేసులు పెట్టి డబ్బులు వసూలు చేస్తోందన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్‌లో బిల్డింగులు నిర్మించే వడ్డెరసోదరులకు చేతినిండా కూడా పని దొరికేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రజల గురించి చూడడం లేదని.. వాళ్ళు తన్నుకోడానికి, వాటాలు పంచుకోవడానికి సరిపోతుందని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న కొండా సురేఖ బిడ్డ, నిన్న జూపల్లి కృష్ణారావు ఎలా మాట్లాడుకున్నారో చూశారని.. కేబినెట్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి, మంత్రులు తిట్టుకున్నారని వ్యాఖ్యానించారు. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడితేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. హైదరాబాదులో కేసీఆర్ లక్ష డబల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించారని గుర్తుచేశారు. ఇక రేవంత్ రెడ్డి లక్ష ఇళ్లను కూలగొట్టించాడని ఎద్దేవా చేశారు. పేదల ఇళ్లు కూల్చొద్దంటే, హైడ్రా బంద్ కావాలంటే కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. మహిళలకు రూ. 2500 రావాలన్నా, వృద్ధులకు రూ. 4000 పెన్షన్ రావాలన్నా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడగొట్టాలని పిలుపునిచ్చారు. ఓటుతో రేవంత్ రెడ్డి చెంపలు వాయించి బుద్ధి చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి డబ్బు మూటలను, గూండాలను నమ్ముకున్నారని ఆరోపించారు. కేటీఆర్, కేసీఆర్‌తో తాను మాట్లాడి వడ్డెర సోదరులు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగాపైకి రావడానికి సంపూర్ణమైన బాధ్యత తీసుకుంటానని హరీశ్ రావు హామీ ఇచ్చారు. ఆరోజు అడగకపోయినా హైదరాబాద్‌లో వడ్డెర సంఘానికి కేసీఆర్ ఎకరం భూమి ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్‌లో వడ్డెర ఆత్మగౌరవ భవనానికి స్థలాలను కేటాయించిందని.. దాని నిర్మాణానికి డబ్బులు ఇచ్చిందని తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎం అంటే కటింగ్ మాస్టర్ అని ఎద్దేవా చేశారు

Latest