- అధికారులు.. బీ అలెర్ట్
- ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెతొద్దు
- తుపానుల నష్టాన్ని బేరీజు వేసుకుని తగిన చర్యలు తీసుకోవాలి
- జాగ్రత్తలు, సహయక చర్యలు, పునరావాసం, నష్టం అంచనాపై ఫోకస్ పెట్టాలి
- మొంథా తుపానుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష
అమరావతి, మహా: మొంథా తుపాను ప్రభావంపై మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాణనష్టం లేకుండా ఆస్తినష్టం ఎక్కువ జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు, సహయక చర్యలు, పునరావాసం, నష్టం అంచనా అనే అంశాలపై అధికారులు ఫోకస్ పెట్టాలన్నారు. కాల్వలు, చెరువులకు గండిపడకుండా చూడాలని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండండని తెలిపారు. లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలకు తరలించాలని అలానే అక్కడ వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అందువల్ల అలెర్టుగా ఉండాలని సీఎం ఆదేశించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కలిసి పని చేయాలని సమస్య ఉందనుకున్న ప్రాంతాల్లో ఇరువురూ క్షేత్ర స్థాయిలో ఉంటే ప్రజలకు భరోసా ఇచ్చినట్టు అవుతుందని సూచించారు. భారీ వర్షాల వల్ల నీరు నిల్వ ఉండకుండా కాలువలు, డ్రైన్ల ద్వారా నీటిని బయటకు పంప్ చేయాలని సూచించారు. విజయవాడ, ఏలూరు, భీమవరం వంటి ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపం అనేది ఉండకూడదని సీఎం ఆదేశించారు. తుపాను ప్రభావిత జిల్లా కలెక్టర్లు ప్రతి గంటకూ బులెటిన్ రిలీజ్ చేయాలని మీడియాకు వాస్తవ పరిస్థితిని వివరించాలని సీఎం సూచించారు. తప్పుడు సమాచారం, ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసే వార్తలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రైతు సేవా కేంద్రాల్లో సిబ్బంది అందుబాటులో ఉండాలని రైతులకు తుపాను అలెర్టులు ఎప్పటికప్పుడు చేరేలా చూడాలని ఆదేశించారు.
పంట నష్టంపై ప్రాథమిక, పూర్తి స్థాయి అంచనాలను రూపొందించుకునే దిశగా దృష్టి పెట్టాలని చెప్పారు. మొంథా తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసుకుని జాతీయ రహదారులపై రాకపోకలను నిలపాలని, ఒకవేళ నిలపాల్సి పరిస్థితే వస్తే ముందుగానే సమాచారం అందివ్వాలని సీఎం తెలిపారు. అంతకు ముందు మొంథా తుపాను ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీఎస్ నుంచి సమీక్షించారు. ప్రస్తుతం తుపాను తీరానికి దగ్గరగా వస్తోందని, కోస్తాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ప్రారంభమైందని అధికారులు వెల్లడించారు. కాకినాడ, మచిలీపట్నం, విశాఖ తదితర తీరప్రాంతాల్లో వర్షాలు, గాలుల తీవ్రత ఉందని చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. గతంలో వచ్చిన తుపానుల నష్టాన్ని బేరీజు వేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుపాను తీరం దాటే కాకినాడ, ఆ పరిసర ప్రాంతాలకు రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అండగా ఉండాలి: తుపాను ప్రభావిత ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మొంథా తుపాను రాష్ట్రంపై ప్రభావం చూపుతుందన్నారు. ఎన్డీయే కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మొంథా తుపాను నేపథ్యంలో నేడు, రేపు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. లీడర్ నుంచి కేడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. తుపాను ప్రభావంతో కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు







