- బండి ప్రకాష్ కటిక దుకాన్ల ప్రస్థానానికి 41 ఏళ్లు
- చీర కొమురయ్య హోటల్ అడ్డా శకం ముగిసింది
- అడవిలో అందరివాడు… నేడు ఒంటరిగా
మంచిర్యాల, మహా : భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు అనుబంధం మాజీ సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) కోల్ బెల్ట్ కార్యదర్శి బండి ప్రకాష్, ఏలియస్ ప్రభాత్, (దాదా) శకానికి మంగళవారం తెరపడింది. తెలంగాణ రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుమేరకు జనజీవన స్రవంతిలో కలిశారు. 1984 సంవత్సరంలో సింగరేణి కాలరీస్ కంపెనీలో సమ్మె చేస్తున్న క్రమంలో అప్పటి ఏఐటిసియూసీ నాయకులు వీటి అబ్రహం నేతృత్వంలో సమ్మె విరమణకు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా బొడ్డు బొందాలు ఆధ్వర్యంలో ఆటోలో మైక్ ద్వారా సమ్మె విరమణ కార్మికులు చేయాలని పేర్కొంటూ కార్మిక వాడలలో ప్రచారం చేశారు. ఆ క్రమంలో రెండవ జోన్ కటిక దుకాణల వద్ద బండి ప్రకాష్ బృందం అడ్డగించి సమ్మె విరమణాన్ని తప్పుపడుతూ దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో కటిక దుకాణాల వద్దకు వీటి అబ్రహం తన మంది మార్బడంతో వచ్చి నేను తలుచుకుంటే 24 గంటల్లో మీ సికాస ను క్లోజ్ చేస్తాను అని హెచ్చరించినట్లు సమాచారం. ఆ హెచ్చరికను చాలెంజిగా తీసుకున్న నాటి (సికాస) మందమర్రి సిఓ సుదర్శన్, ఏలియస్ జనార్ధన్, మాదిరెడ్డి సమ్మిరెడ్డి, ఏలియాస్ (రమాకాంత్) బండి ప్రకాష్, తదితరుల నాయకులు వీటి అబ్రహం ను హత్యకు రూపకల్పన చేసినట్లు సమాచారం. ఏఐటీయూసీ నేత వీటి అబ్రహం హత్య అనంతరం బండి ప్రకాష్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ తర్వాత ప్రకాష్ అరెస్టు వీటి అబ్రహం హత్య కేసు విచారణ కోరకు నిజమాబాద్ జైల్ నుండి
అదిలాబాదుకు వచ్చి సబ్ జెల్ నుండి తనతో పాటు మరో ముగ్గురు తప్పించుకున్నారు. ఆ తర్వాత అప్పటి పీపుల్స్ వార్ పార్టీ ఆదేశానుసారం బండి ప్రకాష్ 1990 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అతడికి ఒక కుమారుడు ఒక కుమార్తె జన్మించారు. ఏఐటీసీయూసీ నాయకులు వీటి అబ్రహం కేసులో తనకు శిక్ష పడింది. దానితో వరంగల్ జైల్ లో సదా అనుభవించారు. తన సత్ప్రవర్తన మూలంగా 2004 సంవత్సరంలో విడుదలయ్యారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్ స్ట్, లేనిలిస్టు, పీపుల్స్ వార్ కు ప్రభుత్వం నిషేధం సడలించి చర్చలకు ఆహ్వానించింది.
ఈ నేపథ్యంలో సింగరేణి కార్మిక సమాఖ్య బాధ్యతలు చేపట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మువ్వాడ సభకు నేతృత్వం వహించారు. ఆ తర్వాత నిర్మల్ ప్రాంతం నుండి బండి ప్రకాష్ కు 20 లక్షల రూపాయలు ఇల్లీగల్ గా వస్తున్న విషయాన్ని పోలీసులు పసిగట్టి వాటిని పట్టుకున్నారు. దానితో బండి ప్రకాష్ ప్రజల నుండి మళ్లీ దూరమై అజ్ఞాత జీవితం ప్రారంభించారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్, లెనినిస్ట్ (పీపుల్స్ వార్) గా ఉన్న పార్టీ కొన్ని పార్టీల అనుసంధానంతో మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీకి జరిగిన చర్చలు విఫలం కావడంతో పూర్తి కాలం ప్రతినిధిగా బండి ప్రకాష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) కాల్ బెల్ట్ కార్యదర్శి ప్రభాత్ గా చలామణి అవుతూ తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.
ఇతడు మందమర్రి మూడవ జూన్ నల్ల పోచమ్మ ఆలయం ఏరియాకు చెందిన సింగరేణి కార్మికుడు బండి రామారావు, అమృతమ్మ దంపతుల రెండో సంతానం. ఇతడి తల్లిదండ్రులు విజయవాడ ఆంధ్ర ప్రాంతం నుండి మందమర్రికి వచ్చి సింగరేణి కంపెనీలో పని చేశారు.
చీర కొమురయ్య హోటల్ ప్రస్థానం ముగిసింది
నిన్న తెలంగాణ రాష్ట్ర డిజిపి సమక్షంలో బండి ప్రకాష్ అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవడంతో చీర కొమురయ్య హోటల్ ప్రస్థానం ముగిసింది. ఈ హోటల్ అడ్డాగా నాటి పీపుల్స్ వార్ ప్రస్థానం మొదలైందనే చెప్పవచ్చు. హోటల్ యజమాని చీర కొమురయ్య దగ్గరకు నాటి విప్లవ పోరాట యోధులు మెరుగు సత్యనారాయణ, గజ్జల గంగారాం, మల్యాల నర్సింగరావు, మహమ్మద్ హుస్సేన్, సుందిళ్ల ధర్మయ్య, పెద్ది శంకర్ తదితరులు వచ్చి పార్టీ సాహిత్యం, జననాట్యమండలి పాటలు ఇతరత్రా కార్యకలాపాలు నేర్పేవారు. కాలక్రమేణా ఏర్పడుతున్న పరిస్థితుల దృష్ట్యా చాలా మంది విప్లవకారులు ప్రభుత్వానికి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. నేటి బండి ప్రకాష్ లొంగుబాటుతో ఆ ప్రస్థానం కాస్త ఇక్కడ ముగిసిపోయిందని భావించక తప్పదు. దీనితో కటిక దుకాణాల హోటల్ కొమురయ్య అడ్డ శకం ముగిసిందని చెప్పవచ్చు.
అడవిలో అందరివాడు… నేడు ఒంటరిగా
అడవిలో అందరివాదిగా ఉన్న బండి ప్రకాష్ నేడు ఒంటరిగా ఎలా జీవిస్తాడో తెలియని పరిస్థితి నెలకొంది. తల్లిదండ్రులు మృతి చెందారు. భార్యా పిల్లలు దూరంగా ఉన్నారు. సోదరులు ఎవరి దారిన వారు బ్రతుకుతున్నారు. వీరందరూ నిన్న మొన్నటి వరకు పోలీసుల నిర్బంధాన్ని ఎదుర్కొని ఊరు పేరు చెప్పలేని స్థలాలలో జీవిస్తున్నారు.
తనకు అనారోగ్యం వెంటాడుతోంది. నిత్యం మందు గోళీలు మింగకుంటే బతికే పరిస్థితి లేదు. ఈ క్రమంలో కుటుంబ బలగం తనను ఆదరిస్తుందో.. లేదో వేచి చూడాల్సిందే. ఈ జనజీవన స్రవంతి భవిష్యత్తులో ఎటు వైపు మళ్లిస్తుందో..







