Mahaa Daily Exclusive

  జూబ్లీహిల్స్ వెనుకబాటుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ లే కారణం:కిషన్‌రెడ్డి

Share

  • బీజేపీది హిందూత్వ ఎజండాయే
  • జూబ్లీహిల్స్ వెనుకబాటుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ లే కారణం
  • మీట్ ది ప్రెస్ లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, మహా : గ్రామాలలో జరిగినంత అభివృద్ధి కూడా జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో జరగలేదని, ఈ వెనుకబాటుకు కారణం గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనే కారణమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. పేరుకే జూబ్లిహిల్స్ స్పన్నులు ఉండే నియోజకవర్గమైనా ఎక్కువ శాతం పేదలు, మధ్యతరగతి ప్రజలున్నారన్నారు. గురువారం జరిగిన మీట్ ది ప్రెస్ లో మాట్లాడిన కిషన్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు. నియోజకవర్గంలో ఓటమి తప్పదని నిర్ధారణకు వచ్చిన అధికార కాంగ్రెస్ పార్టీ ఓటర్లను బెదరించడం, మేం లేకపోతే మీరుండరన్నట్లుగా మాట్లాడటం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీకి ఓటు వేయాలనే దానిపై ఓటర్లు ఇంకా నిర్ణయానికి రాలేదని, అందుకే సర్వేల్లో కూడా స్పష్టత లేదని కిషన్ రెడ్డి అన్నారు. 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. వాటిని మరిచిపోయినట్లు నటిస్తున్న కాంగ్రెస్ నేతలు మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. గ్యారెంటీలపై కాంగ్రెస్ స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యంలో మెజార్టీ వాటా కేంద్రానిదేనని కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ‘ఇజ్జత్’ అంటున్న సీఎం మరి హిందువులు ఇజ్జత్ కాదా చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువులకు గౌరవం లేదా? అని ప్రశ్నించారు. ఎర్రగడ్డలో ఖబరస్థాన్ కోసం స్థలం ఇచ్చేందుకు మనసొచ్చింది కానీ, బంజారాహిల్స్‌లో పెద్దమ్మ తల్లి గుడికి 50 గజాలు స్థలం ఇవ్వడం ఎందుకు కుదరలేదని నిలదీశారు. హిందువులపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక గాంధీ భవన్ లోనో, ఏఐసీసీ కార్యాలయంలోనో డజరగలేదని, మజ్లిస్ పార్టీ హెడ్ క్వార్టర్ దారుస్సలాంలో జరిగిందన్నారు. నాడు హిందువులను బీఆర్ఎస్ చులకన చేసి చూసింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పంథలో వెళ్తుందని మండిపడ్డారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో హిందూత్వ నినాదంతోనే ఓట్లు అడుగుతున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సర్వోలేవీ శాస్త్రాయంగా జరగడం లేదని, అందుకే వాటిని బీజేపీ విశ్వసించడం లేదన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ఫ్రశ్నలకు కిషన్ రెడ్డి సమాధానం ఇచ్చారు.

జూబ్లీహిల్స్ ఎన్నికలు రెఫరెండమా?

అలాంటిది ఏమిలేదు. గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 8 సీట్లు మాత్రమే గెలిచింది ఫలితాలను లోతుగా పరిశీలిస్తే 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాకు లీడింగ్ వచ్చింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 8 సీట్లు గెలిచాం. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో కూడా దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి, బీజేపీ బలమైన పునాది వేసింది. ఉద్యమం సాగుతున్న సమయంలో మహబూబ్‌నగర్ లాంటి సీటును కూడా గెలుచుకోవడం మా పట్ల ప్రజల విశ్వాసానికి నిదర్శనం.

స్మార్ట్ సీటీ ప్రాజెక్టుల అభివృద్ధి ఎంతవరకు వచ్చింది

తెలంగాణలో అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు సంబంధించిన 80 శాతం పనులు పూర్తి అయ్యాయి. కలెక్టర్ల ద్వారా నిరంతరం రివ్యూలు జరుగుతున్నాయి. ఇక రైతుల విషయానికొస్తే, పత్తి కొనుగోళ్లను కేంద్ర ప్రభుత్వం సీసీఐ ద్వారా చేపడుతోంది. అయితే, రైతులు కొనుగోలు సమయంలో 12 శాతం కంటే ఎక్కువ తేమ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది.”

రేవంత్ రెడ్డి విమర్శలపై మీ స్పందన

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పార్టీ చూపిస్తున్న చిత్తశుద్ధిని వారు గమనిస్తున్నారు. అందుకే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను ప్రజలు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉపఎన్నికలో ఇక్కడ విజయం సాధించడం ఖాయం.

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ ఏమైంది

“కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రస్తుతం హైకోర్టులో వాదనలు నడుస్తున్నాయి. మేడిగడ్డ కుంగడంపై కేంద్రం నివేదికలను పరిశీలిస్తోంది. ఇవన్నీ ఒక వైపు జరుగుతుంటే, ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. కేటీఆర్ కూడా ఈ విషయాన్ని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. అందుకే, రాహుల్ గాంధీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను అరెస్టు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డికి అనుమతి ఇవ్వడం లేదు. ఈ రెండు పార్టీల మధ్య అంతర్గతంగా ఒప్పందం జరిగింది అనడానికి ఇదే స్పష్టమైన నిదర్శనం.”

ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలపై మీ స్పందన ఏంటి?

“రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల విమర్శలు సహజమే. కానీ, ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీ గతంలో సైనికులనే అవమానించిన చరిత్ర ఉంది. అలాంటి చరిత్ర ఉన్న రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ వంటి వ్యక్తులు దేశభక్తికి, అభివృద్ధికి కట్టుబడిన బీజేపీపై విమర్శలు చేయడంలో ఆశ్చర్యం ఏముంది? వారికి ఆ నైతిక హక్కు లేదు.”

చేవెళ్ల రోడ్డు ప్రమాదాలపై కేంద్రం బాధ్యతారహిత్యం ఉందా?

“చేవెళ్ల రోడ్డు ప్రాజెక్టు ఆలస్యంపై కేంద్రంపై బాధ్యతారహిత్యం అనే ఆరోపణ తప్పు. భూ సేకరణలో జరిగే ఆలస్యం వల్లనే చాలా ప్రాజెక్టులు ఆలస్యం అవుతుంటాయి. దీనిపై అధికారులతో రివ్యూ చేస్తాం. ఈ రహదారిని గ్రీన్ ఫీల్డ్ హైవేగా నిర్మించాలని చూస్తున్నాం.”

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనా?

“ఇది పూర్తిగా అవాస్తవం. కేటీఆర్ మాట్లాడుతున్న మాటల్లోనే తెలుస్తోంది, ఎవరు ఎవరితో ఒక్కటో! కాంగ్రెస్, బీఆర్ఎస్ గతంలో కలిసి పని చేశాయి. ఈ మధ్య జరిగిన అనేక పరిణామాలు గమనిస్తే, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఢిల్లీ స్థాయిలో అవగాహన కుదిరిందని స్పష్టమవుతోంది. అయితే, బీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికీ కలవవు.”

రాష్ట్రంలోని మైనింగ్ అంతా బీజేపీ నేతల చేతిలో ఉందనే ఆరోపణలు?

“రాష్ట్రంలో మైనింగ్ వ్యవహారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం కేవలం మైనింగ్‌కు సంబంధించిన పాలసీలను మాత్రమే రూపొందిస్తుంది. బొగ్గు గనులు మాత్రమే కేంద్రం అధీనంలో ఉంటాయి, అవి కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నిర్వహించబడుతాయి. ఈ ఆరోపణలు నిరాధారమైనవి.”

42 శాతం బీసీ రిజర్వేషన్లపై మీ అభిప్రాయం?

“రిజర్వేషన్ల బిల్లును మేము అసెంబ్లీలో సమర్థించాం. కానీ, రాష్ట్రంలోని 56 శాతం ఉన్న బీసీలకు ప్రభుత్వం 32 శాతం మాత్రమే కేటాయించింది. మిగతా రిజర్వేషన్‌ను ముస్లింలకు కేటాయించినట్లుగా స్పష్టమవుతోంది. ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశం. హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా ఈ విధానాన్ని అంగీకరించలేదు.”

జూబ్లీహిల్స్‌లో టీడీపీ మద్దతు మీకు ఉందా?

“చంద్రబాబు నాయుడు బీజేపీకి మద్దతు ఇవ్వాలని తెలంగాణ నేతలకు స్పష్టంగా చెప్పారు. దానికి అనుగుణంగానే, టీడీపీకి చెందిన కొంతమంది నేతలు కూడా మాకు మద్దతు ఇస్తున్నారు.”

కాంగ్రెస్, బీఆర్ఎస్ మత రాజకీయాలపై మీరేమంటారు?

“కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పూర్తిగా మత రాజకీయాలకు పాల్పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ నేతను అరువు తెచ్చుకుని పోటీ చేయిస్తోంది. ఎంఐఎం నాయకులు కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం కేవలం ఒక వర్గం ఓట్ల కోసం అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారు. గతంలో ఓవైసీతో దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు మజ్లిస్ ఆడిందే ఆటగా మారింది. మజ్లిస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలే. పాతబస్తీ ఏరియాలో మజ్లిస్ నేతలు ప్రభుత్వ అధికారులపై ప్రజలను ఉసికొల్పడం పరిపాటిగా మారింది

Latest