- కామారెడ్డి కలెక్టరేట్‌లో నకిలీ ఐఏఎస్ హల్చల్
- ఇంచార్జి కలెక్టర్ హోదాలో వచ్చానంటూ నకిలీ ఉత్తర్వులతో మహిళ హంగామా
- ఉద్యోగం వచ్చినట్టు కుటుంబ సభ్యులను నమ్మించేందుకేనని నిర్ధారించిన పోలీసులు
కామారెడ్డి, మహా : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో నకిలీ ఐఎఎస్ అధికారి హల్ చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఈ నెల 2వ తేది నుండి సెలవులో ఉన్నారు. దీంతో ఇంచార్జి కలెక్టర్‌గా నిజామాబాద్ కలెక్టర్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 4వ తేదీన కామారెడ్డి కలెక్టరేట్‌కు ఒక యువతి కారులో వచ్చింది. నేరుగా కలెక్టర్ ఛాంబర్ వైపు వెళ్లి తనను ఇంచార్జి కలెక్టర్‌గా నియమించారని అక్కడున్న అదనపు కలెక్టర్ కు నకిలీ ఉత్తర్వులు చూపించింది. అయితే ఉత్తర్వులను ప్రభుత్వానికి పంపించామని, పైనుండి ఆదేశాలు వచ్చాక తమ నిర్ణయం చెబుతామని మహిళకు అదనపు కలెక్టర్ తెలిపారు. కాసేపు ఛాంబర్‌లో కూర్చొని వెళ్లిపోవడంతో, అనుమానంతో పోలీసులకు కలెక్టరేట్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు తూప్రాన్ వద్ద హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన ఇస్రత్ జహాన్ అనే మహిళను అదుపులోకి తీసుకుని విచారించారు. 2020 నుండి గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుందని, ఉద్యోగం వచ్చిందని కుటుంబ సభ్యులను నమ్మించేందుకే ఈ ప్రయత్నం చేసిందని పోలీసుల నిర్ధారించారు. దీంతో మహిళపై చీటింగ్ కేసు పెట్టి ఆమెను వదిలేశారు







