- రైనా, ధావన్‌కు ఈడీ షాక్
- రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం
- బెట్టింగ్ యాప్‌ల కేసులో భారత క్రికెట్ మాజీ ఆటగాళ్లపై కొరడా
ఢిల్లీ, మహా: అక్రమ బెట్టింగ్ యాప్‌ల కేసులో భారత క్రికెట్ మాజీ ఆటగాళ్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్‌లపై ఈడీ కొరడా ఝళిపించింది. ఈ ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకుని, వారికి చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు సంస్థ గురువారం ప్రకటించింది. రైనా పేరుతో ఉన్న రూ.6.64 కోట్ల మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్, ధావన్ పేరుతో ఉన్న రూ.4.5 కోట్ల విలువైన స్థిరాస్థిని ఈడీ అటాచ్ చేసినట్లు వివరించింది.ఈ చర్యలు 1xBet అనే విదేశీ బెట్టింగ్ సంస్థ, దాని అనుబంధ బ్రాండ్లు 1xBat, 1xBat Sporting Lines పై కొనసాగుతున్న దర్యాప్తులో భాగమని అధికారులు తెలిపారు. రైనా, ధావన్ ఇద్దరూ ఈ బ్రాండ్లతో ప్రమోషన్ ఒప్పందాలు చేసుకుని ప్రచార కార్యక్రమాలు నిర్వహించినట్లు విచారణలో తేలింది. ఈ ఒప్పందాల చెల్లింపులు అనుమానాస్పద విదేశీ మార్గాల ద్వారా జరిగాయని, అవి అక్రమ బెట్టింగ్ కార్యకలాపాల ద్వారా వచ్చిన నేరపూరిత మొత్తాలని అని ఈడీ నిర్ధారించింది.
నకిలీ బ్యాంకు ఖాతాల ద్వారా నిధులు..
ఈడీ దర్యాప్తులో 1xBet సంస్థ భారత్‌లో విస్తృతంగా అక్రమ బెట్టింగ్ నెట్వర్క్ నడిపిందని వెల్లడైంది. దేశవ్యాప్తంగా 6,000కి పైగా ‘మ్యూల్ అకౌంట్స్’ (నకిలీ బ్యాంకు ఖాతాలు) ద్వారా ఈ నిధులు చలామణి అయినట్లు అధికారులు తెలిపారు. వినియోగదారుల నుండి వసూలుచేసిన సొమ్మును పేమెంట్ గేట్‌వేలు, మోసపూరిత వ్యాపార ఖాతాల ద్వారా తరలించారని, వాటిలో చాలావరకు కేవైసీ ధృవీకరణ లేకుండానే సాగినట్లు తేలింది. ఆన్‌లైన్ బెట్టింగ్ ద్వారా సేకరించిన మొత్తాలు రూ.1,000 కోట్లకు మించి ఉన్నాయని ఈడీ అంచనా వేసింది. ఇప్పటికే నాలుగు పేమెంట్ గేట్‌వేల్లో పరిశోధనలు జరిపి, 60 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.4 కోట్లకు పైగా మొత్తాన్ని స్తంభింపజేసినట్లు అధికారులు తెలిపారు







