- ప్రముఖ కవి ‘అందెశ్రీ’కి కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి నివాళులు
- అందెశ్రీతో అనుభవాలను నెమరువేసుకున్న కేంద్ర మంత్రి
- అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటన్న కిషన్ రెడ్డి
హైదరాబాద్, మహా : తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, సహజ కవి అందెశ్రీ స్వర్గస్తులు కావడాన్ని తెలంగాణ సమాజం, కవులు, కళాకారులు జీర్ణించుకోలేకపోతున్నారని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనేక విషయాలను ముక్కుసూటిగా చెప్పే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అందెశ్రీ అని అన్నారు. వారు రాసిన అనేక పాటలు ప్రజల హృదయాల్లో ఎల్లప్పుడూ నిలిచిపోతాయని తెలిపారు. మాయమైపోతున్నడమ్మ మనిషన్న వాడు అంటూ, జయ జయహే తెలంగాణ వంటి అద్భుతమైన పాటలను తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాటలతో లక్షలాది మందిలో స్ఫూర్తి రగిలించారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అందెశ్రీతో పాల్గొనే అవకాశం నాకు కలిగిందని, పోరు యాత్రలో చాలా సభల్లో అందెశ్రీ పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నదులపై పరిశోధన చేసి పుస్తకం రాయాలనే సంకల్పంతో ఆయన అనేక పరిశోధనలు చేశారని, ఈ సమయంలో అమెరికాలో వారితో కలిసి పర్యటించే అవకాశం నదులపై చర్చించే అవకాశం లభించిందన్నారు. దురదృష్టవశాత్తు ఆ పుస్తకం పూర్తి కాకుండానే వారు మనకు దూరమయ్యారన్నారు. నరేంద్రమోదీ అంటే అందెశ్రీకి ఎంతో అభిమానమని, అనేకసార్లు మా ఇంటికి వచ్చి సమకాలీన అంశాలు, రాజకీయాలపై చర్చించుకునేవాళ్లమన్నారు. అలాగే అందెశ్రీ నాకు సలహాలు కూడా ఇచ్చేవారని, చాలా పేదరికం నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి.. గ్రామీణ ప్రాంతాల సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి, ప్రజల హృదయాలను గెలుచుకున్నారన్నారు. సమాజంలో మార్పు రావాలని, ప్రజల్లో చైతన్యం కలిగించాలని ప్రతి క్షణం ఆలోచించేవారన్నారు.








