- సాహిత్య సమరయోధుడికి కడసారి వీడ్కోలు..
- అధికారిక లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు
- అందెశ్రీ పార్థీవ దేహానికి నివాళులర్పించిన సీఎం రేవంత్
- అంతిమయాత్రలో పాల్గొని పాడె మోసిన ముఖ్యమంత్రి
- వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, సాహితీప్రియులు
హైదరాబాద్, మహా: ప్రముఖ కవి, రచయిత, ఉద్యమ గొంతుక, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ పార్థీవ దేహాన్ని సందర్శించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి నివాళులర్పించారు. ఎంతోకాలంగా అత్యంత సన్నిహితంగా మెలిగిన అందెశ్రీ ఆకస్మిక మరణంతో భారమైన హృదయంతో ముఖ్యమంత్రి వారి అంతిమయాత్రలో పాల్గొని అశ్రునివాళి అర్పించారు. అంతిమయాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి అందెశ్రీ పాడె మోశారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, సాహితీప్రియులు అక్షరయోధుడికి కడసారి వీడ్కోలు పలికారు. మొదట లాలాపేట్ జయశంకర్ స్టేడియం నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్కేసర్ ఎన్ఎఎఫ్సీ నగర్ వరకు అంతిమ యాత్ర సాగింది.
అందెశ్రీ సతీమణి మల్లు బాయి , కుమార్తెలు వాక్కులమ్మ, వెన్నెల, వేకువ, కుమారుడు దత్తు సంప్రదాయ పద్ధతిలో కర్మకాండలను నిర్వహించగా, అధికారిక లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి.. అందెశ్రీ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతిమ సంస్కార కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించారు. సాహిత్య సమరయోధుడి అంతిమయాత్రలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, సీతక్క , పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, కే కేశవరావు, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.







