- మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తున్నాం
- మొదటి క్యాబినెట్‌లోనే మత్స్య శాఖకు రూ. 23 కోట్ల బడ్జెట్ కేటాయింపు:రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
- ‘నోవాటెల్’లో ‘వరల్డ్ ఆక్వా కల్చర్ ఇండియా- 2025’ కాన్ఫరెన్స్
హైదరాబాద్, మహా: మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో హెచ్ఐసీసీ ‘నోవాటెల్’లో ఏర్పాటు చేసిన ‘వరల్డ్ ఆక్వా కల్చర్ ఇండియా- 2025’ కాన్ఫరెన్స్‌కు మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా మత్స్య శాఖపై రూపొందించిన పాటను మంత్రి సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు. కాన్ఫరెన్స్‌లో మత్స్య సంపద, మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి పైన ప్రధానంగా చర్చ చేయనున్నారు. ఈ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. మత్స్యకారుల కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. గతంలో నిర్వీర్యానికి గురైన మత్స్య శాఖను పునర్నిర్మాణం చేస్తూ, మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మొదటి క్యాబినెట్‌లోనే మత్స్య శాఖకు దాదాపుగా 123 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు జరిగాయని తెలిపారు. మత్స్యకారులందరి తరపున సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఒక కోటి 40 లక్షల రూపాయలతో మత్స్యకారులకు ఇన్సూరెన్స్ కల్పించడం జరిగిందని తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల మధ్య ఉండటమే కాకుండా, తెలంగాణకు గొలుసు కట్టు చెరువులు ఒక గొప్ప వరం అన్నారు. ఈ నీటివనరులు మత్స్య సంపదకు ఎంతగానో దోహదపడతాయని మంత్రి అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మత్స్యశాఖ క్రియాశీలకంగా మారేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, తెలంగాణ ఫిషరీస్ డైరెక్టర్ నిఖిల, ఎన్ఎఫ్‌డీబీ సీఈఓ బెహరా, జాయింట్ సెక్రటరీ నీతు కుమారి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఐకార్ జాయ్ కృష్ణ, పీవీఎన్ఆర్ వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జ్ఞాన ప్రకాష్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.







