- టి- సాట్ అధ్యర్యంలో రాష్ట్ర స్థాయి విద్యార్థుల వార్షిక పోటీలు-2025
- ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభకు పట్టం
- 12,13 తేదీల్లో రాష్ట్ర స్థాయి పోటీలు
- -ముగింపు ఉత్సవాలకు హాజరుకానున్న మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, మహా: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు ‘విద్యార్థుల వార్షిక పోటీలు-2025’ పేరుతో పోటీలు నిర్వహిస్తున్నామని టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 6 వతరగతి నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు మండల స్థాయి నుండి జోనల్ స్థాయి వరకు నిర్వహించారు. నవంబర్ నాల్గవ తేది నుండి మొదలై 13వ తేదీన రాష్ట్ర స్థాయిలో టి-సాట్ వేదికగా జరిగే వేడుకలతో ఈ పోటీలు ముగియనున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని సుమారు 600లకు పైగా మండలాలు, 33 జిల్లాల స్థాయిలో జరిగిన పోటీల్లో సుమారు 22,000 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో 10,000 విద్యార్దులకు మెరిట్ సర్టిఫికేట్స్ అందచేశామన్నారు. టి-సాట్ వేదికగా నవంబర్ 12,13 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీల్లో క్విజ్, వ్యాసరచన, వక్తృత్వ విభాగాలకు సంబంధించి దాదాపు 100 మంది విద్యార్థులు పాల్గొంటారని, వారికి మెరిట్ సర్టిఫికేట్లతో పాటు మెమొంటో అందచేయనున్నామన్నారు. ముగింపు ఉత్సవానికి రాష్ట్ర ఐటి, ఇండస్ట్రీస్ శాఖా మాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతుల ప్రదానం చేస్తారని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.







