- భారీగా మావోయిస్టుల లొంగుబాటు
- డీజీపీ ఎదుట ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు సహా 37 మంది మావోయిస్టుల లొంగుబాటు
- మిగతా వారు కూడా లొంగిపోవాలన్న డీజీపీ శివధర్ రెడ్డి
- భారీగా ఆయుధాల సరెండర్
- మిగతా వారూ లొంగిపోవాలన్న డీజీపీ
హైదరాబాద్, మహా : వరుస ఎన్ కౌంటర్లతో సతమతమవుతున్న మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. అజ్ఞాతంలో ఉన్న 37 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులను శనివారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నారాయణ అలియాస్ రమేశ్, రాష్ట్ర కమిటీ మరో సభ్యుడు సోమ్‌దా అలియాస్ ఎర్ర కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు. మిగతా వారిలో ముగ్గురు డివిజనల్ కమిటీ సభ్యులు, 9 మంది ఏరియా కమిటీ సభ్యులున్నన్నారు. లొంగిపోయిన వారి నుంచి రెండు ఏకే 47లు, 4 ఎస్ఎల్ఆర్లు, 303 తుపాకులు, 343 తూటాలు అప్పగించారని డీజీపీ ఈ సందర్భంగా తెలపారు.
మావోయిస్టులంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారేనని డీజీపీ తెలిపారు. ఖమ్మం డివిజనల్ కమిటీకి చెందిన వారు 9 మంది, దక్షిణ బస్తర్ కమిటీకి చెందిన వారు 22 మంది ఉన్నట్లు వివరించారు. పార్టీ పరమైన విభేదాలు, భద్రతాపరమైన సమస్యలు, అనారోగ్య కారణాల వల్ల మావోయిస్టులు లొంగిపోయినట్లు డీజీపీ చెప్పారు. లొంగిపోయిన వారికి నిబంధనల ప్రకారం పునరావాస ప్యాకేజీ అందిస్తామని డీజీపీ తెలిపారు. కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్‌పై రూ.20 లక్షల రివార్డు, అప్పాస్ నారాయణపై రూ.20 లక్షల రివార్డు ఇలా లొంగిపోయిన అందరిపై కలిపి రూ.1.41 కోట్ల రివార్డు ఉందని, అది వారికే అందజేస్తామని డీజీపీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారికి ప్రభుత్వం ఇస్తున్న పునరావాస ప్యాకేజీ కూడా అందిస్తామని పేర్కొన్నారు. సెంట్రల్ కమిటీలో తెలంగాణ వాళ్లు ఇంకా ఐదుగురు ఉన్నారని, మిగతా వాళ్లు కూడా త్వరగా లొంగిపోవాలని సూచిస్తున్నట్లు తెలిపారు.
అజ్ఞాతంలో ఉన్న వారు బయటకు ఎంత త్వరగా వస్తే అంత మంచిదని డీజీపీ అన్నారు. రాష్ట్రానికి చెందిన 59 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని, వారిలో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు, 10 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారన్నారు. ప్రభుత్వ, రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకులు, మీడియా ఇలా ఎవరి ద్వారా అయినా మావోయిస్టులు బయటికి రావచ్చన్నారు. ఇటీవల జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా పిలుపునిచ్చారని డీజీపీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ సెంట్రల్ కమిటీలో ఉన్నారని డీజీపీ చెప్పారు. పోలీసుల ముందుకు వచ్చిన వారికి పూర్తి భద్రత ఉంటుందని, లొంగిపోయిన వారికి ఎలాంటి వేధింపులుండవని హామీ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. మావోయిస్టు పార్టీని దేవ్‌జీ లీడ్ చేస్తున్నారని చెప్పేందుకు కచ్చితమైన సమాచారం లేదని, దేవ్‌జీ, గణపతి కూడా లొంగిపోయేందుకు వస్తే సంతోషిస్తామన్నారు. హిడ్మా లొంగిపోయిన తర్వాత పోలీసులు కాల్చి చంపేశారనేది వాస్తవం కాదన్నారు. గడిచిన 11 నెలల్లో 465 మంది మావోయిస్టులు రాష్ట్ర ప్రభుత్వం ఎదుట లొంగిపోయారని పేర్కొన్నారు. అజ్ఞాతంలో ఉన్న వారిలో తెలంగాణకు చెందిన వారు 59 మంది ఉన్నారన్నారు.
మిగతా వారు కూడా లొంగిపొండి : ఆజాద్
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు సోదరులు ఎంత త్వరగా లొంగిపోతే అంత మంచిదని ఆజాద్ అన్నారు. మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి ఎవరనేది తమకు ఇంకా తెలియదని చెప్పారు. పార్టీకి చెప్పిన తర్వాతే లొంగిపోయామనిన్నారు. అయితే ఆయాధాలు పార్టీకి అప్పగించకుండా లొంగిపోవడంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.








