Mahaa Daily Exclusive

  మరణాల రేటు నివారణకు యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలి:మంత్రి పొన్నం

Share

  • ఓవర్ లోడ్‌పై ఉక్కుపాదం
  • పర్మిట్లు రద్దు, డ్రైవింగ్ లైసెన్స్‌లు సీజ్
  • మరణాల రేటు నివారణకు యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలి
  • అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం

హైదరాబాద్, మహా: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి, మరణాల రేటును నివారించే లక్ష్యంతో రవాణా శాఖ అమలు చేస్తున్న సంస్కరణలను మరింత కఠినతరం చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతస్థాయి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ వేగవంతం చేయడానికి ఏర్పాటు చేసిన 33 జిల్లా స్థాయి బృందాలు, మూడు రాష్ట్ర స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలను మరింత ముమ్మరం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలను ఏ బృందం ఎక్కడ చేపడుతుందనే ముందస్తు సమాచారం లేకుండా, ప్రతిరోజు ఉదయం 6 గంటలకు సమాచారం అందించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను అమలు చేస్తున్నారు. గత 10 రోజుల వ్యవధిలో నిర్వహించిన తనిఖీల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 4,748 కేసులు నమోదు చేయగా, మొత్తం 3,420 వాహనాలను సీజ్ చేశారు.

ముఖ్యంగా ఓవర్ లోడ్ కారణంగా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతుండడంతో, దానిపై ఎక్కువగా దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ఓవర్ లోడ్ అయిన వాహనాలు సీజ్ చేయడమే కాకుండా, రెండోసారి పట్టుబడితే ఆ వాహనం పర్మిట్ రద్దు చేయడంతో పాటు, డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ లైసెన్స్‌ను కూడా రద్దు చేసేలా కఠిన చర్యలు తీసుకోనున్నారు. మైనింగ్ శాఖతో సమన్వయం చేసుకుంటూ, వాహనాల లోడింగ్ జరిగే ప్రాంతాలలోనే ఓవర్ లోడ్‌ను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రవాణా శాఖ కమీషనర్ ఇలంబర్తి, జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్లు రమేష్, చంద్రశేఖర్ గౌడ్, శివ లింగయ్యలు పాల్గొన్నారు.

Latest