Mahaa Daily Exclusive

  గ్లోబల్ తెలంగాణ లక్ష్యం: ‘విజన్ 2047’ ప్లానింగ్ ఖరారు

Share

  • గ్లోబల్ తెలంగాణ లక్ష్యం
  • ఆరు రోజుల ‘విజన్ 2047’ ప్లానింగ్ ఖరారు
  • సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా సమీక్షలు
  • తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు

హైదరాబాద్, మహా: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సదస్సుకు దేశీయంగానే కాకుండా, వివిధ దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, ప్రముఖ ఆర్థిక నిపుణులు, దార్శనికులు పెద్ద ఎత్తున హాజరవుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం ఈ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

‘తెలంగాణ రైజింగ్ 2047’ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ..
‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో నిర్వహించబోయే ఈ గ్లోబల్ సమ్మిట్ వేదికగా రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమైన ‘తెలంగాణ రైజింగ్ 2047’ డాక్యుమెంట్‌ని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా ఎదిగేందుకు, లక్ష్యాలను నిర్దేశించే ఈ దార్శనిక పత్రంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. సమ్మిట్ నిర్వహణ, దార్శనిక పత్రంపై తుది మెరుగులు దిద్దడం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం నుంచి నవంబర్ 30 వరకు వరుస సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ కీలక సమావేశాలు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరుగుతాయి. ఈ వరుస సమీక్షల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు అంశాల వారీగా సంబంధిత మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొంటారు.

ముఖ్యమంత్రి నిర్వహించనున్న ఈ సమీక్షల షెడ్యూల్..

=నవంబర్ 25:
అంశం: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ.
చర్చ: సమ్మిట్‌కు సంబంధించిన ప్రధాన అజెండా, ఆహ్వానితులు, అంతర్జాతీయ భాగస్వామ్యాలు.

=నవంబర్ 26:
అంశం: లాజిస్టిక్స్, సమ్మిట్ ఏర్పాట్లు.
చర్చ: వేదిక నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, రవాణా, ప్రతినిధులకు వసతి వంటి కార్యాచరణ ప్రణాళిక.

=నవంబర్ 27:
అంశం: మౌలిక వసతులు, అభివృద్ధి.
రంగాల సమీక్ష: పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, రవాణా, రోడ్లు – భవనాలు, ఆర్థిక, విద్యుత్, గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణం, మున్సిపల్ వ్యవహారాలు.

=నవంబర్ 28:
అంశం: విద్య, యువజన సంక్షేమం.
రంగాల సమీక్ష: క్రీడలు, నైపుణ్యత (స్కిల్ డెవలప్‌మెంట్), పర్యాటకం (టూరిజం), దేవాదాయ శాఖ.

=నవంబర్ 29:
అంశం: వ్యవసాయం, అనుబంధ విభాగాలు, సంక్షేమం.
రంగాల సమీక్ష: వ్యవసాయ రంగం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల పనితీరు.

=నవంబర్ 30:
అంశం: ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమం.
చర్చ: ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం, వైద్య సేవలు, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలపై ప్రణాళిక.

Latest