హైకోర్టు సంచలన ఆదేశాలు..!
* ఆ 32 పంచాయతీల్లో ఎన్నికలు బంద్.
* ములుగు, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లోని ఆ గ్రామాలకు మినహాయింపు.
* మిగతా చోట్ల యధావిధిగా ఎలక్షన్స్.
ఖమ్మం బ్యూరో, మహా.
రాష్ట్రంలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. న్యాయస్థానం వెలువరించిన తాజా ఆదేశాలను అనుసరించి, రాష్ట్రంలోని కొన్ని నిర్దిష్ట ప్రాంతాలను ప్రస్తుత ఎన్నికల నిర్వహణ నుంచి మినహాయిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఉత్తర్వుల ప్రభావం ప్రధానంగా ములుగు, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని మండలాలపై పడింది. ముఖ్యంగా ములుగు జిల్లా మంగపేట మండలంలోని ఇరవై ఐదు (25) గ్రామ పంచాయతీలను ఈ ఎన్నికల నుంచి పూర్తిగా మినహాయించారు. అలాగే కరీంనగర్ జిల్లా వి.సైదాపూర్ మండలంలోని రెండు (2) పంచాయతీలలో కూడా ఎన్నికలు నిలిపివేశారు. ఇక ఖమ్మం జిల్లా విషయానికి వస్తే, ఏన్కూరు మండలంలోని నాలుగు (4) పంచాయతీలు ,పెనుబల్లి మండలంలోని ఒక (1) గ్రామ పంచాయతీని ఈ జాబితాలో చేర్చారు. ఈ గ్రామాల్లో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎన్నికల నిర్వహణ ఉండదని స్పష్టమైంది. అయితే, పైన పేర్కొన్న గ్రామాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన అన్ని చోట్ల ఎన్నికల ప్రక్రియ యధావిధిగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. పదవీకాలం ముగిసిన పంచాయతీలకు, అలాగే కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు ముందస్తు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. ఈ మేరకు ఆయా జిల్లాల యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కోర్టు పరిధిలోని అంశాలు పరిష్కారమైన తర్వాత, మినహాయించిన గ్రామాలకు సంబంధించి తదుపరి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.








