- దేశం మీద ఇదేనా ఓవైసీ ప్రేమ?
- వందేమాతరం గేయం ఆలపిస్తే నిలబడరా?
- ఓవైసీ కౌన్సిలర్లపై ఎంపీ రఘునందన్ రావు ఫైర్
హైదరాబాద్, మహా: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సభలో వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఈ సమయంలో కొంత మంది ఎంఐఎం సభ్యులు కుర్చీలో నుంచి లేవకపోవడం పట్ల బీజేపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ అనంతరం మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్‌లో వందేమాతరం గీతం పాడాలని మేయర్‌ని అనుమతి అడిగాం అని తెలిపారు. మేయర్ దానికి ఒప్పుకున్నారు కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు కూడా ఒప్పుకున్నారని క్లారిటీ ఇచ్చారు. కానీ మజ్లిస్ సభ్యులు కనీస గౌరవం లేకుండా వారి కుర్చీల నుంచి లేవలేదని ఆరోపించారు. దేశం స్వాతంత్ర్యం కోసం వందేమాతరం ఉద్యమం చేసి నినాదం ఇస్తే కులం, మతం, ప్రాంతం చూడకుండా ఉద్యమం చేశారని వివరించారు. కానీ మజ్లిస్ సభ్యులు దానికి మతం రంగు పూస్తున్నారని మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని మేయర్ ను కోరినట్లు వెల్లడించారు. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఓవైసీ బారిష్టర్ కదా.. దేశం మీద ఇదేనా మీ ప్రేమ అని ప్రశ్నించారు. బిహార్‌లో మజ్లిస్ కాంగ్రెస్‌కు ఎందుకు మద్దతు ఇవ్వలేదో ఓవైసీని అడగండని ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు.








