- ఐబొమ్మ రవిది ఓవర్‌కాన్ఫిడెన్స్
- భార్యకేం సంబంధం లేదు.. ఆమె పట్టించలేదు
- వెబ్-3 ద్వారా పైరసీ చేస్తే పట్టుకోవడం చాలా కష్టం
- రవి నుంచి రాబట్టినట్లు వివరాలు సైబర్‌క్రైమ్ అడిషనల్ సీపీ శ్రీనివాస్ వెల్లడి
హైదరాబాద్, మహా: ఐ- బొమ్మ కేసుకు సంబంధించి నిందితుడు ఇమంది రవి నుంచి కీలక వివరాలు రాబట్టినట్లు సైబర్‌క్రైమ్ అడిషనల్ సీపీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. ఐ-బొమ్మ వెబ్‌సైట్‌ను రవి మరో కంపెనీ నుంచి హోస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. డొమైన్‌ను ‘ఎన్‌జల’ కంపెనీలో రిజిస్టర్ చేసినట్లు తెలిపారు. ఐ-బొమ్మ వెబ్‌సైట్ వివరాలను మంగళవారం ఆయన మీడియాకు వెల్లడించారు. కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా రవి సినిమాలు పోస్ట్ చేసినట్లు ప్రకటించారు. ‘ ఐ బొమ్మ, బప్పం వెబ్‌సైట్ల ద్వారా రవి సినిమాలు పోస్ట్ చేసేవాడు. ఆయా వెబ్‌సాఫ్ట్‌వేర్‌లో రీడైరెక్ట్ స్క్రిప్ట్ రాశాడు. తద్వారా గేమింగ్, బెట్టింగ్ వెబ్‌సైట్లకు వెళ్తుంది. ఇప్పటికీ మరికొన్ని పైరసీ వెబ్‌సైట్లు నడుస్తూనే ఉన్నాయి. మూవీరూల్జ్, తమిళ్‌ఎంవీ లాంటి పలు పైరసీ వెబ్‌సైట్లు ఇప్పటికీ నడుస్తున్నాయి. ఆయా వెబ్‌సైట్ల నిర్వాహకులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఐబొమ్మ పాపులర్ అయ్యాక.. దాని పేరును చాలా మంది వాడుకుంటున్నారు. సినిమా సమీక్షలకు ఆ వెబ్‌సైట్ పేరు వాడుకుంటున్నారు.
ఇమంది రవి రూ.20 కోట్ల వరకు సంపాదించినట్లు తెలిసింది. భవిష్యత్‌లో వెబ్-3 టెక్నాలజీ రాబోతోంది. దాని ద్వారా పైరసీ చేస్తే.. పట్టుకోవడం చాలా కష్టం. ఐబొమ్మ రవి ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. రవి భార్య మాకు సమాచారం ఇచ్చిందన్న వార్తలు అవాస్తవం. ఆయన భార్యను మేం విచారించలేదు. పైరసీ వ్యవహారం దర్యాప్తు చాలా సంక్లిష్టతతో కూడిన వ్యవహారం. ఐ బొమ్మ రవి ఒంటరి.. వారానికో దేశం తిరిగేవాడు. ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. లక్ష డాలర్లు వెచ్చించి కరేబియన్ దీవుల పౌరసత్వం కొన్నాడు. రవి వెబ్‌సైట్లకు నిఖిల్ అనే మరోవ్యక్తి పోస్టర్లు డిజైన్ చేసేవాడు. మన చట్టాల ప్రకారం ఇక్కడ విదేశీయులు నేరం చేసివుంటే.. అది నేరమే. నేరగాళ్ల అప్పగింతపై మనకు పలుదేశాలతో సంబంధాలున్నాయి’ అని శ్రీనివాస్ వివరించారు.








