ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ అధినాయకత్వంతో సమావేశం కానున్నారు. కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న టీపీసీసీ చీఫ్ నియామకంతో పాటుగా నామినేటెడ్ పదవులు…మంత్రివర్గ విస్తరణ పైన చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే టీపీసీసీ నియామకం పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, స్థానికంగా నెలకొన్న పరిస్థితులతో రేవంత్ ఛాయిస్ కీలకం కానుంది. అదే సమయం లో కీలక పదవుల భర్తీ పైన తుది నిర్ణయంతీసుకోనున్నారు.
ఢిల్లీకి రేవంత్
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఖరారులో కీలక పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ టీపీసీసీ నియామకం పూర్తి చేయాలని కాంగ్రెస హైకమాండ్ భావిస్తోంది. అందులో భాగంగా..పలువురి ముఖ్యుల పేర్లు ఇప్పటికే తెర మీదకు వచ్చాయి. మహేశ్‌కుమార్‌గౌడ్ తనకు దాదాపు పదవి ఖాయమైందన్న ధీమాతో ఉండగా.. తాజాగా తెరమీదకు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరు వచ్చింది. ఆయన తనకు పార్టీలో తగిన గుర్తింపు ఇస్తారని, పీసీసీ అధ్యక్ష పదవి తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
టీపీసీసీ రేసులో
పీసీసీ పదవి గిరిజన వర్గానికి ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేరు కూడా తెరపైకి వచ్చింది. పార్టీలో మాదిగ సామాజికవర్గానికి చెందిన లక్ష్మణ్‌కు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే మంచిదని, ఎస్సీల వర్గీకరణ రాష్ట్రంలో ప్రధానాంశంగా ఉండటంతో లక్ష్మణ్ వంటి సీనియర్లకు పీసీసీ పదవి ఇస్తే బాగుంటుందన్న ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తున్నది. మరో నేత మధుయాష్కీ కూడా రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతున్నది. ఈ మొత్తం సమీకరణాల పై రేవంత్ చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
కీలక చర్చలు
ఇక, నామినేటెడ్ పదవుల్లోనూ భారీగా ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా.. రేవంత్ తన పర్యటనలో నామినేటెడ్ పోస్టులకు కూడా 20 మందిని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. పార్టీ విభాగాలకు అధ్యక్షుల నియామకం, మంత్రి పదవుల విస్తరణ వంటి అంశాలపైనా చర్చించనున్నట్టు సమాచారం. దీంతోపాటు ఢిల్లీలో ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులతోనూ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చర్చించనున్నారు. రేవంత్ ఢిల్లీ పర్యటనతో పదవుల పైన ఒక స్పస్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.








