Mahaa Daily Exclusive

  రైతులపై నింద వేయడం అలవాటైంది…

Share

  • రైతులపై నింద వేయడం అలవాటైంది
  • పంట వ్యర్థాల దహనాన్ని రాజకీయం చేయొద్దు
  •  కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ, మహా: ఢిల్లీలో వాయు కాలుష్యంపై విచారణ సందర్భంగా సోమవారం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశరాజధానిలో పెరుగుతున్న వాయు కాలుష్యానికి రైతులను నిందించడం సరికాదని పేర్కొంది. పంట వ్యర్థాల దహనాన్ని రాజకీయం చేయొద్దని..దాన్ని అహంకారానికి సంబంధించిన విషయంగా పరిగణించకూడదని సూచించింది. పంట దహనం చేయకూడదంటే వ్యర్థాలను తొలగించడానికి వారి వద్ద యంత్రాలు కూడా ఉండాలని పేర్కొంది. ఢిల్లీ కాలుష్య అంశాన్ని కాలానుగుణమైన అంశంగా పరిగణించలేమని తెలిపింది.

కాలుష్య నివారణకు శాస్త్రీయ పరిష్కారాల కోసం ప్రయత్నాలు చేయాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. కాలుష్య నివారణకు ఇప్పటి వరకు ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ తీసుకున్న చర్యల వల్ల గాలి నాణ్యత ఎంతమేరకు మెరుగుపడిందనే విషయంపై వారంలోపు నివేదిక సమర్పించాలని సూచించింది. వారి కార్యాచరణ ప్రణాళిక అసమర్థంగా ఉంటే.. ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కాలుష్యం విషయంలో ప్రతిసారి పంట వ్యర్థాల దహనాన్ని కారణంగా చూపడం..సరైన చర్య కాదని సుప్రీంకోర్టు మందలించింది. రైతులపై నింద వేయడం అలవాటుగా మారిపోయిందని అసహనం వ్యక్తం చేసింది.