Mahaa Daily Exclusive

  బెంగళూరు ట్రాఫిక్‌ చాలా ఘోరం..

Share

  • బెంగళూరు ట్రాఫిక్‌ చాలా ఘోరం
  • అసమర్థ అధికారుల వల్లే రాష్ట్రానికి అపఖ్యాతి
  • సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ తీవ్ర వ్యాఖ్యలు

బెంగళూరు, మహా: బెంగళూరు ట్రాఫిక్‌ పై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు ట్రాఫిక్‌ చాలా ఘోరంగా ఉందని.. నగర పోలీసులు నిష్ప్రయోజకులంటూ విమర్శించారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి ఆదివారం తాను ఢిల్లీ బయల్దేరగా.. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయినట్లు తెలిపారు. వాహనాల రద్దీని క్లియర్‌ చేయడానికి రోడ్డుపై ఒక్క ట్రాఫిక్‌ పోలీస్‌ కూడా లేరని అన్నారు. విమానాశ్రయానికి సమయానికి చేరుకోవడంలో ఇబ్బంది నెలకొనడంతో బెంగళూరు పోలీసులను సంప్రదించినప్పటికీ.. వారు స్పందించలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ ట్రాఫిక్‌ సమస్యపై ఎంపీ సోషల్‌ మీడియా వేదికగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దృష్టికి తీసుకెళ్లారు. బెంగళూరులో ట్రాఫిక్‌ నిర్వహణ సరిగా లేదని.. అందమైన నగరంగా ప్రఖ్యాతి చెందిన నగరం అసమర్థ అధికారుల వల్లే అపఖ్యాతిని మూటగట్టుకుంటోందని విమర్శించారు. ట్రాఫిక్‌ సమస్యల వల్ల అందరి నుంచి విమర్శలు ఎదుర్కొంటోందని అన్నారు.