Mahaa Daily Exclusive

  దేశంలో తొలిసారి: మెట్రోలో 20 మంది ట్రాన్స్‌జెండర్ల నియామకం

Share

  • దేశంలోనే మొదటిసారి..
  • మెట్రో లో 20 మంది ట్రాన్స్‌జెండర్‌ల నియామకం
  • కోచ్‌లు, స్టేషన్లలో భద్రత పర్యవేక్షణ, ప్రయాణికులకు దిశానిర్దేశం

హైదరాబాద్‌, మహా:: మెట్రో రైలు మరో కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా విభాగంలో ట్రాన్స్‌జెండర్‌లను నియమించింది. ప్రత్యేక శిక్షణ ఇచ్చి నియమించిన 20 మంది ట్రాన్స్‌జెండర్ సిబ్బంది డిసెంబర్‌ 1 నుంచి ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో విధుల్లో చేరారు. ఈ చొరవతో మహిళా ప్రయాణికుల భద్రతా మరింత బలోపేతం కావడంతో పాటు సామాజిక సాధికారతకు ప్రతీకగా నిలుస్తుందని మెట్రో యాజమాన్యం వెల్లడించింది. దేశంలోనే అత్యాధునిక నగర రవాణా వ్యవస్థల్లో ఒకటైన మెట్రో రైలు, మూడు కారిడార్లలో 57 స్టేషన్లతో ప్రతిరోజూ సుమారు 5 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది.

ప్రయాణికుల్లో మహిళలు సుమారు 30 శాతం మంది ఉండగా.. వారి భద్రత, సౌకర్యం, విశ్వాసంపై మెట్రో రైలు వ్యవస్థ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో యాజమాన్యం తెలిపింది. కొత్తగా నియమితులైన వారు.. జనరల్, మహిళలకు ప్రత్యేకంగా కేటాయించిన కోచ్‌లలో భద్రతా చర్యలు చేపట్టడం, ప్రయాణికులకు దిశానిర్దేశం చేయడం, సమాచారం, అవసరమైన సహాయం అందించడానికి అందుబాటులో ఉంటారు. ప్రయాణికులు సౌకర్యవంతంగా, సురక్షితంగా వెళ్లేలా స్కానర్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. స్ట్రీట్-లెవెల్, కాన్‌కోర్స్ భద్రతలో కూడా ట్రాన్స్‌జెండర్‌లు పాలుపంచుకుంటారని మెట్రో యాజమాన్యం పేర్కొంది.