ఛత్తీస్‌గఢ్‌లో రక్తపాతం.
* భీకర ఎన్‌కౌంటర్‌లో 12 మంది నక్సల్స్ మృతి.
* ముగ్గురు జవాన్లు అమరులు.
* స్వాధీనమైన ఆయుధాలు, పేలుడు పదార్థాలు.
* ఇంకా భద్రతా దళాల అధీనంలో ఘటనా స్థలం.
ఛత్తీస్‌గఢ్,మహా.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం జరిగిన ఓ భీకర పోరాటం మావోయిస్టు పార్టీకి మరో తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఏకంగా 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే, దురదృష్టవశాత్తు దేశ సేవలో ఉన్న ముగ్గురు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు తమ ప్రాణాలను కోల్పోయారు. మరో ఇద్దరు డీఆర్‌జీ జవాన్లు గాయపడగా, వారిని తక్షణ చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
పోలీసు ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం, బీజాపూర్ పరిధిలోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు జరిపిన గాలింపు చర్యల సందర్భంగా ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. నక్సలైట్లు భద్రతా దళాలపై కాల్పులు జరపగా, జవాన్లు ధీటుగా బదులిచ్చారు. ఘటనా స్థలం నుంచి ఐదుగురు నక్సలైట్ల మృతదేహాలను ఇప్పటివరకు స్వాధీనం చేసుకోగా, మిగిలిన మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. ఘర్షణ జరిగిన ప్రాంతం నుంచి భారీగా పేలుడు పదార్థాలు, అత్యాధునిక ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
2026 మార్చి నాటికి మావోయిస్టు పార్టీని అంతం చేయాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంతో మొదలైన ఆపరేషన్ కగార్ ద్వారా దండకారణ్యంలో మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు తుది దశకు చేరుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అగ్ర నాయకత్వంలో వరుసగా ఏర్పడిన లోటు నక్సల్స్ క్యాడర్‌ను కుదిపేసింది. గత కొద్ది నెలలుగా ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నంబాల కేశవరావుతో పాటు, మావోయిస్టు పార్టీ అత్యంత కీలక నేతలలో ఒకరైన మడవి హిడ్మాను సైతం భద్రతా బలగాలు ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లలో అంతం చేశాయి. ఇది మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా పరిగణించబడుతోంది.
అగ్రనేతల మరణాలతో పాటు, మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న వంటి సీనియర్ నాయకులు లొంగిపోవడం, మరొక కీలక నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ పోలీసుల అదుపులో ఉన్నారనే వార్తలు రావడం మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నాయి. ఒకప్పుడు దండకారణ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాంతరంగా జనతా సర్కార్ నడిపిన మావోయిస్ట్ పార్టీ, భద్రతా దళాల దూకుడు వ్యూహాలతో, వరుస ఎదురుదెబ్బలతో కుదేలైపోయింది. ఈ తాజా ఎన్‌కౌంటర్, ఆపరేషన్ కగార్ విజయానికి మరో మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోంశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.






