Mahaa Daily Exclusive

  ఇండిగోకు గ్రహణం.. ప్రయాణికులకు నరకం..!

Share

  • ఇండిగోకు గ్రహణం.. ప్రయాణికులకు నరకం!
  •  కోలుకోవడానికి పది రోజులు.. ప్రయాణికులకు క్షమాపణలు!
  •  ఇండిగో ఎఫెక్ట్‌: ఆకాశాన్నంటుతున్న విమాన ధరలు
  •  వెయ్యి విమానాలు రద్దు.. రంగంలోకి కేంద్రం!

న్యూ ఢిల్లీ, మహా.

దేశీయ విమానయాన రంగంలో అగ్రగామిగా ఉన్న ఇండిగో సంస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. సాంకేతిక, నిర్వహణ లోపాలతో శుక్రవారం ఒక్కరోజే ఏకంగా వెయ్యికి పైగా విమాన సర్వీసులు రద్దు కావడంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్టులలో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాస్తూ తీవ్ర అసహనానికి గురవుతున్నారు. పరిస్థితి చేజారిపోవడంతో కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందిస్తూ అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సమస్య మూలాలను కనుగొనడంతో పాటు, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది.

ఈ అనూహ్య పరిణామాలపై ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బెర్స్ వీడియో సందేశం ద్వారా స్పందించారు. గత కొన్ని రోజులుగా సర్వీసుల్లో అంతరాయం ఏర్పడిందని, శుక్రవారం అది పతాక స్థాయికి చేరిందని అంగీకరించారు. సంస్థ తరఫున ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన ఆయన, సాధారణ పరిస్థితులు నెలకొనడానికి కనీసం పది రోజుల సమయం పడుతుందని స్పష్టం చేశారు. డిసెంబర్ 10 నుంచి 15 మధ్య నాటికి సర్వీసులు యథావిధిగా నడిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అప్పటివరకు ప్రయాణికులు సహకరించాలని కోరారు.

మరోవైపు ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం 24 గంటల పాటు పనిచేసే ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. సమాచారం కోసం 011-24610843, 011-24693963, 096503-91859 నంబర్లను సంప్రదించాలని సూచించింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్ళవలసిన దేశీయ విమానాలన్నీ అర్ధరాత్రి వరకు రద్దు కావడంతో ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.

ఇదే అదనుగా ఇతర విమానయాన సంస్థలు టికెట్ ధరలను భారీగా పెంచేయడం ప్రయాణికులకు మరో షాక్ ఇచ్చింది. రద్దీ ఎక్కువగా ఉండే ఢిల్లీ-ముంబై మార్గంలో టికెట్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. రౌండ్ ట్రిప్ ధర రూ.60 వేలకు చేరగా, వన్-వే టికెట్ ధర రూ.35 వేలుగా చూపిస్తుండటంతో అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వారు లబోదిబోమంటున్నారు. ఇండిగో సంక్షోభం ఇటు ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతూ, అటు ప్రయాణాన్ని నరకప్రాయంగా మార్చేసింది.

Latest