సర్కార్ భారీ స్కెచ్!
* ఫ్యూచర్ సిటీలో ‘కొత్త సినీ సామ్రాజ్యం’.
* చెన్నై టు హైదరాబాద్ తరహాలో ఇప్పుడు ‘ఫ్యూచర్ సిటీ’కి టాలీవుడ్ ప్రస్థానం!
* రేవంత్ డ్రీమ్ ప్రాజెక్ట్ లో కీలక భాగస్వామి కానున్న నాగార్జున!
* ఇంటర్నేషనల్ మీడియా సిటీ.. గ్లోబల్ సమ్మిట్ వేదికగా రివీల్ అయిన అసలు ప్లాన్.
* ఫ్యూచర్ సిటీలో ‘క్రియేటివ్ ఎకానమీ’.. వేల మందికి ఉపాధి కల్పించే దిశగా కొత్త అడుగులు
హైదరాబాద్, మహా.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ వేదికగా రాష్ట్ర సినిమా ముఖచిత్రం మారబోతోందనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. కేవలం పెట్టుబడుల సేకరణే కాకుండా, హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో ‘ఫ్యూచర్ సిటీ’ (ఫోర్త్ సిటీ)ని ఒక కీలకమైన ‘క్రియేటివ్ అండ్ మీడియా హబ్’గా మార్చాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. గ్లోబల్ సమ్మిట్‌లో నాగార్జున వంటి అగ్ర నటుడి భాగస్వామ్యం ఈ ప్రణాళికలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. దశాబ్దాల క్రితం మద్రాసు నుండి హైదరాబాద్‌కు తెలుగు సినిమా పరిశ్రమ తరలివచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వాలు ఎలాంటి ప్రోత్సాహకాలు అందించాయో, ఇప్పుడు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ నుండి ఫ్యూచర్ సిటీకి పరిశ్రమను విస్తరించడానికి ప్రస్తుత ప్రభుత్వం అదే స్థాయిలో చొరవ చూపుతోంది.
వాస్తవానికి హైదరాబాద్‌లోని ఫిలింనగర్, జూబ్లీహిల్స్ ప్రాంతాలు ప్రస్తుతం తీవ్రమైన ట్రాఫిక్ రద్దీతోనూ, స్థలాభావంతోనూ సతమతమవుతున్నాయి. ఈ క్రమంలో ముచ్చర్ల కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీలో కాలుష్య రహిత వాతావరణం, అత్యాధునిక మౌలిక సదుపాయాలు సినిమా షూటింగ్‌లకు స్వర్గధామంగా మారనున్నాయి. ప్రభుత్వం అక్కడ కేవలం సినిమా స్టూడియోలకే పరిమితం కాకుండా, ఒక పూర్తిస్థాయి ‘మీడియా సిటీ’ని నిర్మించే యోచనలో ఉంది. ఇందులో భాగంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, విజువల్ ఎఫెక్ట్స్ , యానిమేషన్ వంటి రంగాలకు పెద్దపీట వేయనున్నారు. అందుకే ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కాబోయే స్టూడియోలు సంప్రదాయ పద్ధతిలో కాకుండా, ప్రపంచ స్థాయి సాంకేతికతతో కూడిన ‘స్మార్ట్ స్టూడియోలు’గా ఉండబోతున్నాయి. నాగార్జున బాలీవుడ్ ప్రముఖులతో కలిసి చేయాలనుకుంటున్న నిర్మాణం కూడా ఈ ‘టెక్నాలజీ బేస్డ్’ ప్లాన్‌లో భాగమేనని సమాచారం.
మరో కీలకమైన అంశం ఏమిటంటే, ఈ ప్రాజెక్ట్ వెనుక ‘నైపుణ్యాభివృద్ధి’ అనే బలమైన ఉద్దేశం దాగి ఉంది. ఫ్యూచర్ సిటీలో ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సినిమా పరిశ్రమను అక్కడికి తీసుకువెళ్లడం ద్వారా.. ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్ ఇంజనీరింగ్, గ్రాఫిక్స్ వంటి రంగాల్లో స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి, అక్కడికక్కడే ఉపాధి కల్పించాలన్నది ప్రభుత్వ ఆలోచన. అంటే ఫ్యూచర్ సిటీ కేవలం వినోదానికి మాత్రమే కాకుండా, వేల మంది యువతకు ఉపాధి కల్పించే ‘ఎంప్లాయిమెంట్ జోన్’గా మారబోతోంది. పెట్టుబడిదారులను ఆకర్షించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ సమ్మిట్‌లో.. సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా భావించి, దానికి అవసరమైన భూకేటాయింపులు, రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి, నాగార్జున పర్యటన కేవలం ఒక మర్యాదపూర్వక భేటీ కాదు. ఇది తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న ‘మెగా మాస్టర్ ప్లాన్ 2050’లో సినిమా పరిశ్రమను ఒక ప్రధాన భాగస్వామిగా మార్చే వ్యూహాత్మక అడుగు. రాబోయే రోజుల్లో ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ స్థాయి ఫిలిం ఫెస్టివల్స్, గ్లోబల్ ఈవెంట్స్ జరిగేలా, పర్యాటక రంగం అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ కొత్త విజన్ కార్యరూపం దాల్చితే, ఇండియన్ సినిమాకు హాలీవుడ్ స్థాయి మౌలిక వసతులు తెలంగాణ గడ్డపైనే అందుబాటులోకి రావడం ఖాయం.






