కాషాయ కండువా కప్పుకున్న నటి ఆమని.
* రామచందర్ రావు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆమని.
* గ్రామీణ తెలంగాణలో పెరుగుతున్న ఆదరణ.
* బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు.
హైదరాబాద్, మహా.
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన సీనియర్ నటి ఆమని రాజకీయ రంగానికి శ్రీకారం చుట్టారు. శనివారం నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె అధికారికంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కూడా పాల్గొని ఆమనిని అభినందించారు. ఆమెతో పాటు సినీ రంగానికి చెందిన ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ శోభలత కూడా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు.
మోదీ విజన్ చూసి ఆకర్షితురాలినయ్యా..
పార్టీలో చేరిన అనంతరం ఆమని మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, ఆయన దేశాభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. “ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం భారతీయులమని గర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే అది మోదీ చలవే. ఆయన స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలనే బలమైన ఆకాంక్షతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. కేవలం రాజకీయాల కోసమే కాకుండా, సనాతన ధర్మ పరిరక్షణ కోసం మోదీ పడుతున్న తపన నన్ను పార్టీ వైపు నడిపించింది” అని ఆమె స్పష్టం చేశారు. మహిళా సాధికారత, సామాజిక అంశాలపై పార్టీ ఇచ్చే ఏ బాధ్యతనైనా చిత్తశుద్ధితో నెరవేరుస్తానని ఆమె వెల్లడించారు.
*గ్రామీణ తెలంగాణలో పెరుగుతున్న ఆదరణ*
* రామచందర్ రావు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మాట్లాడుతూ.. ఆమని లాంటి సుప్రసిద్ధ నటులు పార్టీలోకి రావడం శుభపరిణామమని కొనియాడారు. జంబలకిడిపంబ, మిస్టర్ పెళ్ళాం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఆమని, ఇప్పుడు రాజకీయాల్లోనూ విజయవంతం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారుతున్నాయని, ఇటీవలే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారులు భారీగా విజయం సాధించడమే అందుకు నిదర్శనమని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి సరైన ప్రత్యామ్నాయం బీజేపీనేనని ప్రజలు నమ్ముతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.








