Mahaa Daily Exclusive

  మొన్న నిధి.. నేడు సామ్…..

Share

* మొన్న నిధి.. నేడు సామ్..
* హీరోయిన్లకు ఫ్యాన్స్ ‘సెల్ఫీ’ కష్టాలు!
* అభిమానం హద్దు దాటింది.. హైదరాబాద్‌లో సమంతకు చుక్కలు
* షాపింగ్ మాల్ వద్ద ఉద్రిక్తత.. బౌన్సర్ల సాయంతో బయటపడ్డ సమంత
* సమంతకు చేదు అనుభవం.. కారు ఎక్కేందుకు తీవ్ర ఇబ్బందులు.

హైదరాబాద్, మహా.

సినీ తారలపై అభిమానం ఉండటం సహజమే కానీ, ఆ అభిమానం హద్దులు దాటితే ఎంత ఇబ్బందికరంగా మారుతుందో తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఘటనే నిదర్శనం. ప్రముఖ హీరోయిన్ సమంతకు చేదు అనుభవం ఎదురైంది. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమెను చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడటంతో అక్కడ గందరగోళం నెలకొంది. బౌన్సర్ల సాయంతో ఆమె అతికష్టం మీద కారు ఎక్కి అక్కడి నుంచి బయటపడాల్సి వచ్చింది. నగరంలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సమంత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమ అభిమాన తారను చూసేందుకు ఫ్యాన్స్ భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కార్యక్రమం ముగించుకుని సమంత తిరిగి వెళ్తున్న సమయంలో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఆమె షాపింగ్ మాల్ నుండి బయటకు వచ్చి తన కారు వద్దకు వెళ్తుండగా, అభిమానులు సెల్ఫీల కోసం ఆమెపైకి దూసుకొచ్చారు. అప్పటికే ఏర్పాటు చేసిన బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బంది వారిని వారించే ప్రయత్నం చేసినప్పటికీ, జనం తోసుకుంటూ ఆమెకు అత్యంత సమీపంలోకి రావడంతో సమంత ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అభిమానులు చుట్టుముట్టడంతో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. చివరకు బౌన్సర్లు రక్షణ వలయంగా ఏర్పడి, కష్టపడి ఆమెను కారు ఎక్కించడంతో సమంత అక్కడి నుంచి ఊపిరి పీల్చుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే, కేవలం రెండు రోజుల క్రితం హీరోయిన్ నిధి అగర్వాల్‌కి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ‘రాజాసాబ్’ సినిమా గ్లింప్స్ విడుదల ఈవెంట్‌లో పాల్గొన్న నిధిని అభిమానులు చుట్టుముట్టారు. ఆ సమయంలో ఆమె కూడా తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. అభిమానం పేరుతో ఫ్యాన్స్ ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం వల్ల హీరోయిన్లు బహిరంగ కార్యక్రమాలకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడుతోందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అభిమానులు తమ ప్రవర్తనతో తారలకు ఇబ్బంది కలగకుండా సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Latest