Mahaa Daily Exclusive

  స్వర్ణగిరి క్షేత్రంలో ధనుర్మాస శోభ..!

Share

యాదాద్రి : యాదాద్రి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ధనుర్మాసోత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఈ నెల 30న జరగనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించేందుకు ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. ధనుర్మాస వేడుకల్లో భాగంగా ఆదివారం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజామునే స్వామివారికి సుప్రభాత సేవ, అనంతరం సహస్రనామార్చన ఘనంగా జరిగాయి. లోక కళ్యాణార్థం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని స్వర్ణాభరణాలు, రంగురంగుల పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుదీరినట్లుగా భావించే గోపృష్ట దర్శనాన్ని భక్తులకు కల్పించారు. మరోవైపు, భూదేవి అంశగా వెలసిన శ్రీ ఆండాళ్ అమ్మవారికి నవ కలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి చీర సారెలను తిరుమాడ వీధుల్లో ఊరేగించి సమర్పించారు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లు, తాగునీరు మరియు ప్రసాద వితరణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Latest