- నంద్యాల జిల్లాలో దారుణం
- ముగ్గురు పిల్లలకు విషమిచ్చిన తండ్రి- ఆపై సూసైడ్
నంద్యాల, మహా : ఓ తండ్రి తన ముగ్గురు మైనర్ కుమారులను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణమైన ఘటన నంద్యాల జిల్లాలోని ఉయ్యాలవాడ మండలంలో వెలుగు చూసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం తుడుములదిన్నె గ్రామానికి చెందిన వేములపాటి సురేంద్ర (35) ఈ దారుణానికి ఒడిగట్టాడు. తన ముగ్గురు పిల్లలైన కావ్యశ్రీ (7), జ్ఞానేశ్వరి(4), సూర్యగగన్(2)లకు విషం కలిపిన కూల్‌డ్రింక్‌ను తాగించాడు. దీంతో ఈ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆపై తండ్రి సురేంద్ర కూడా ఉరి వేసుకొని చనిపోయాడు. గతేడాది ఆగస్టులో సురేంద్ర భార్య… మహేశ్వరి అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత నుంచి సురేంద్ర మానసికంగా ఇబ్బందిపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ దారుణానికి ఒడిగట్టాడా అనేది తేలాల్సి ఉంది. ఈ ఘటనకు గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉందని ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్ తెలిపారు. విచారణ తర్వాత మరిన్ని వివరాలు బయటికొస్తాయని పేర్కొన్నారు.
సురేంద్ర కుటుంబం ఆర్థికంగా పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొంటోందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిసింది. దీనికితోడు భార్య ఆగస్టులో ఉరి వేసుకొని చనిపోవటంతో మరింత మానసిక కుంగుబాటుకు సురేంద్ర లోనైట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది.





