Mahaa Daily Exclusive

  పోలీస్ బాస్ ‘ఫిట్‌నెస్’ మంత్రం: సీపీ సజ్జనర్ 2026 సంకల్పాలివే!

Share

  • పోలీస్ బాస్‌ ‘ఫిట్‌’నెస్ శపథం
  • ఆసక్తికరంగా మారిన హైదరాబాద్ సీపీ సజ్జనర్ 2026 ‘రెజల్యూషన్స్.

హైదరాబాద్, మహా : నిత్యం నేరస్తుల భరతం పట్టే పనిలో, నగర భద్రతా పర్యవేక్షణలో తలమునకలై ఉండే నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనర్‌.. జిమ్‌కు వెళ్లే విషయంలో మాత్రం సామాన్యుడిలాగే ఇన్నాళ్లూ వాయిదాల పర్వాన్ని నడిపారు. అయితే ఈ కొత్త ఏడాదిలో ఆ ధోరణికి చెక్ పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. శారీరక దృఢత్వం కోసం ఎప్పటినుంచో జిమ్‌లో చేరాలని అనుకుంటున్నప్పటికీ.. విధి నిర్వహణ హడావుడిలో వాయిదా పడుతూ వస్తున్న ఆ ప్రణాళికను ఈసారైనా కచ్చితంగా ఆచరణలో పెట్టడమే తన ప్రధాన వ్యక్తిగత లక్ష్యమని ‘ఎక్స్’ ద్వారా సీపీ సజ్జనర్ వెల్లడించారు.

నూతన సంవత్సర వేడుకల బందోబస్తు హడావుడి ముగిశాక.. తన వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాలను ఆయన నగరవాసులతో పంచుకున్నారు. నిరంతరం ప్రజల భద్రత గురించి ఆలోచించే ఓ ఉన్నతాధికారి.. తన ఫిట్‌నెస్ గురించి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది. కేవలం వ్యక్తిగత ఆరోగ్యమే కాదు, నగర ఆరోగ్యాన్ని కాపాడటం కూడా తన బాధ్యతేనని సజ్జనర్ స్పష్టం చేశారు. ఈ ఏడాది ప్రధానంగా ‘సైబర్ నేరాలపై యుద్ధం’ ప్రకటిస్తున్నట్లు సంకేతాలిచ్చారు. ఆన్‌లైన్ మోసాలు, సరికొత్త తరహా నేరాలకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా, అత్యంత సురక్షిత నగరంగా తీర్చిదిద్దడమే తమ ప్రథమ అజెండా అని తేల్చిచెప్పారు. సమర్థవంతమైన పోలీసింగ్‌కు వెన్నముక లాంటి క్షేత్రస్థాయి సిబ్బంది ఆరోగ్యం విషయంలో రాజీపడేది లేదని సీపీ భరోసా ఇచ్చారు. వారు శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉన్నప్పుడే ప్రజలకు మరింత మెరుగైన సేవలందుతాయని, అందుకే సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తామని వెల్లడించారు. వృత్తిలో రాణించడానికి ‘నిరంతర అభ్యాసం’ మంత్రంలాంటిదని నమ్మే సజ్జనర్.. ఈ ఏడాది పుస్తక పఠనానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రత్యేక సమయం కేటాయిస్తానని తెలిపారు. అన్నింటికీ మించి, నిత్యం విధి నిర్వహణలో తన వెన్నంటి ఉంటూ ప్రోత్సహించే కుటుంబ సభ్యులు, మిత్రులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

Latest