- పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి
- ఈ నేల నాలో చైతన్యాన్ని నింపింది, ధైర్యాన్ని ఇచ్చింది
- యువత రాజకీయాల్లోకి రావాలి
- కొండగట్టులో పవన్ పిలుపు
హైదరాబాద్, మహా : తెలంగాణ గడ్డపై దశాబ్ద కాలం తర్వాత జనసేన పార్టీ సాధించిన తొలి విజయం చారిత్రాత్మకమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. శనివారం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం, ఇటీవల తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా, వార్డు సభ్యులుగా విజయం సాధించిన అభ్యర్థులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజేతలను పేరుపేరునా అభినందిస్తూ, తెలంగాణ రాజకీయాల్లో ఇదొక సరికొత్త మార్పుకు నాంది కావాలని ఆయన ఆకాంక్షించారు.
తెలంగాణలో పుట్టిన జనసేన పార్టీ
సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, తాను పార్టీ పెట్టడానికి నాలో చైతన్యం నింపింది, నాకు ధైర్యం ఇచ్చింది తెలంగాణ నేలే అని భావోద్వేగంగా పేర్కొన్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ బిడ్డలు చేసిన పోరాటం, అమరవీరుల త్యాగాల నుంచి తాను రాజకీయ శక్తిని పొందానని చెప్పారు. రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడటానికి ఇక్కడి పోరాట స్ఫూర్తే కారణమని, తెలంగాణలో పుట్టిన జనసేన పార్టీ ఇక్కడి ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సిద్ధాంత బలం ఉన్న నాయకులను ఎవరూ ఏమీ చేయలేరు
తెలంగాణకు ప్రస్తుతం బలమైన, నిజాయితీ కలిగిన యువ నాయకత్వం అవసరమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల ప్రతినిధులుగా మీరు వేసిన ఈ చిన్న అడుగు, భవిష్యత్తులో మహా ప్రస్థానానికి దారి తీస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సిద్ధాంత బలం ఉన్న నాయకులను ఎవరూ ఏమీ చేయలేరని, పదవుల కోసం కాకుండా ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఎదగాలని పిలుపునిచ్చారు. పోటీ చేసిన స్థానాల్లో 50 శాతం విజయం సాధించడం సామాన్యమైన విషయం కాదని, ఇది పార్టీ శ్రేణుల కష్టానికి నిదర్శనమని కొనియాడారు.
తెలుగు ప్రజలందరూ ఐక్యంగా ఉండాలి
రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు భిన్నంగా ఉన్నప్పటికీ, తెలుగు ప్రజలందరూ ఐక్యంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలు క్షేమంగా ఉండాలి, ప్రజల మధ్య ఐక్యత కోసం మనమంతా కలిసి పనిచేద్దాం అని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి అభివృద్ధిని ప్రారంభించి, జనసేన మార్క్ పాలనను ప్రజలకు చూపించాలని ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. గెలిచిన అభ్యర్థులు పవన్ కల్యాణ్ మాటలతో కొత్త ఉత్సాహం వచ్చినట్లయింది.








