Mahaa Daily Exclusive

  ఇద్దరు పిల్లల నిబంధన రద్దు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం….హర్షం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క

Share

  • గ్రామీణ, స్థానిక ఎన్నికల్లో
  • ఇద్దరు పిల్లల నిబంధన రద్దు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
  • హర్షం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క

హైదరాబాద్, మహా : అసెంబ్లీలో శనివారం కీలక బిల్లుకు ఆమోదం లభించింది. రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన పంచాయితీరాజ్ చట్టంలోని 21వ సెక్షన్ సవరణ బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉంటే గ్రామీణ, స్దానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు అనే నిబంధన ఇన్నాళ్లు కొనసాగుతూ వస్తోంది. ఈ సవరణ బిల్లుకు తాజాగా అసెంబ్లీ ఆమోదం లభించడంతో ఇకపై ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉన్నా, స్దానిక ఎన్నికల్లో పోటీకి అర్హులవుతారు. సంతానంతో సంబంధం లేకుండా ఎవరైనా పోటీ చేసే వెసులుబాటు కల్పించారు. దీనిపై గతంలో ఆర్డినెన్స్ జారీ కాగా, తాజాగా బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు.

ఇద్దురు పిల్లల నిబంధన వల్ల నష్టాలివే…

ఇద్దరు పిల్లలు నిబంధనల వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ అమలవుతోందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కానీ ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం ఎటువంటి నియంత్రణ పాటించకుండా జనాభా పెరుగుదలను ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. ఇలా కొనసాగుతూపోతే జనాభా ప్రాతిపధికతోపాటు రాజకీయంగా ఉత్తరాది రాష్ట్రాల పెత్తనం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 1980 1990 మధ్యకాలంలో దేశంలో సంభవించిన జనాభా విస్పోటనం వల్ల ఆహార భద్రతకు ముప్పు వాటిల్లడమే కాకుండా, పోషకాహార లోపం, నిరుద్యోగం, వ్యాధులు, తగిన ఉత్పాదకత లేకపోవడం ఇలా తీవ్ర ప్రతికూల పరిస్దితులు దేశంలో ఉన్నాయి. 1994 మే 30వ తేదిన తెలంగాణ పంచాయితీరాజ్ చట్టంలో 1994 సెక్షన్ 21లోని సబ్ సెక్షన్ 3 క్రింద పంచాయితీ రాజ్ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ నిబంధన అమల్లోకి తెచ్చిన 30 ఏళ్ల తరువాత జనాభా లెక్కలను పరిశీలిస్తే, ముఖ్యంగా తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి రేటు 1.7కు పడిపోయింది. ఇలా కొనసాగిస్తే రాష్ట్రంలో జనాభా పరంగా ప్రతికూల పరిస్దితులు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు గుర్తించారు.

రాష్ట్రంలోని భవిష్యత్ తరాల ప్రయోజనాలు, రాజకీయ భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని, పంచాయితీరాజ్ సంస్దలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సంతానోత్పత్తి రేటు 2.1గా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనాభాతోపాటు ఆర్దిక వృద్ది రేటు సాధించేందుకు, అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు ,పడిపోతున్న సంతాన సాఫల్యాన్ని మెరుగుపరిచేందుకు పంచాయితీరాజ్ చట్టంలోని సెక్షన్ 21లో సబ్ సెక్షన్ 3ను తొలిగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైతే భవిష్యత్ తిరిగి మార్పులు చేర్పులు చేసుకోవచ్చని అభిప్రాయపడ్డ అసెంబ్లీ ఉభయ సభలూ, పంచాయితీరాజ్ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేసింది. బిల్లు ఆమోదానికి అసెంబ్లీ ఆమోదం తెలపడంతో పంచాయితీరాజ్ శాఖ మంత్రి సీతక్క సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

Latest